బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 మే 2020 (18:47 IST)

ఢిల్లీలో విలయతాండవం.. 195మంది ఎయిమ్స్ సిబ్బందికి కరోనా

దేశ రాజధాని నగరం ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. ఎయిమ్స్‌లో వైద్య సిబ్బందికి మహమ్మారి సోకడం కలకలం రేపుతోంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఇప్పటివరకు 195 సిబ్బంది వైరస్ బారినపడ్డారు. గత రెండు రోజుల వ్యవధిలోనే 50మంది సిబ్బందికి ఈ కరోనా వైరస్ సోకింది. 
 
వీరిలో ఎంబీబీఎస్‌ విద్యార్థితో పాటు రెసిడెంట్‌ వైద్యులు, నర్సులు, మెస్‌ వర్కర్లు, లేబోరేటరీ సిబ్బంది, సాంకేతిక సహాయకులు, శానిటేషన్ వర్కర్లు, భద్రతా విభాగాల్లో పనిచేసే సిబ్బంది ఉన్నారు. వీరిలో కొందరు ఈ వైరస్‌ లక్షణాల నుంచి కోలుకొని మళ్లీ విధుల్లోకి హాజరు కాగా.. మిగతా వారంతా చికిత్స పొందుతున్నారు. మరోవైపు, ఈ ఆదివారం శానిటేషన్‌ సూపర్‌వైజర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి మృతి చెందాడు.
 
అలాగే ఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌ (ఎన్‌డీఎంసీ) ప్రధాన కార్యాలయాన్ని అధికారులు మూసివేశారు. ఈ కార్యాలయంలో పనిచేసే సీనియర్‌ ఉద్యోగికి కరోనా సోకవడంతో ఈ చర్యలు చేపట్టారు. తాజాగా నమోదైన కేసుతో ఎన్‌డీఎంసీలో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య ఏడుకి చేరింది. 
 
ఇక ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 792 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ రాజధానిలో మొత్తం కేసుల సంఖ్య 15257 చేరింది. ఇప్పటివరకు 303మంది మృతి చెందారు.