జమ్మూకాశ్మీర్‌లో శాంతి నెలకొనడాన్ని పాకిస్థాన్ సహించలేకపోతోంది.. అందుకే ఇలా?
స్వాతంత్య్ర దినోత్సవానికి ఒకరోజు ముందు శుక్రవారం జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్ శివార్లలోని నౌగాం ప్రాంతంలోని బైపాస్ వద్ద పోలీస్ పెట్రోలింగ్ బృందంపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మరో పోలీస్ తీవ్రగాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ దాడి చేసింది పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాదులేనని, వారిని గుర్తించామని, త్వరలోనే మట్టుబెడతామని చెప్పారు. ఉగ్రవాదులపై పోలీసులు ఎదురు కాల్పులు జరిపితే సమీపంలో నివసిస్తున్న పౌరులు చనిపోయేవారని, అందువల్లనే వారు పోలీసులు సంయమనంతో వ్యవహరించారని తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో శాంతి నెలకొనడాన్ని పాకిస్థాన్ సహించలేకపోతున్నదన్నారు.