మూఢనమ్మకాలు.. ఆ చిన్నారి పొట్ట చుట్టూ 51 వాతలు.. మృతి
మూఢ నమ్మకాలకు ఓ పసికందు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వ్యాధి నయం అవుతుందని మూడు నెలల చిన్నారికి 51సార్లు పొట్ట భాగంలో వాతలు పెట్టారు. దీంతో ఇన్ఫెక్షన్ బారిన పడిన ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
వివరాల్లోకి వెళితే.. గిరిజనులు ఎక్కువగా ఉండే మధ్యప్రదేశ్, షాదోల్ జిల్లాలోని సింగ్‌పుర్ కథౌటియా గ్రామానికి చెందిన మూడు నెలల చిన్నారి న్యూమోనియా బారినపడింది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. కానీ చికిత్స కోసం తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకెళ్లకుండా.. స్థానికంగా ఉన్న మంత్రగాళ్లకు చూపించారు.
వ్యాధి తగ్గిస్తామని చెప్పి మంత్రగాళ్లు ఈ అమానుషానికి పాల్పడ్డారు. పాప పొట్ట చుట్టూ కాల్చిన ఇనుప రాడ్డుతో ఒకటీ రెండు కాదు ఏకంగా 51 సార్లు వాతలు పెట్టారు. దీంతో చిన్నారి ఆరోగ్యం మరింత క్షీణించింది. తప్పు తెలుసుకున్న తల్లిదండ్రులు చిన్నారిని ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది.
15 రోజులపాటు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడి చిన్నారి మృతి చెందింది. పాపకు తల్లిదండ్రులు అంత్యక్రియలు పూర్తి చేశారు. కానీ అధికారులు చిన్నారిని ఖననం చేసిన చోటుకెళ్లి.. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేసేందుకు చర్యలు చేపట్టారు.