తమిళనాడులో "నీట్" మరణాలు... మరో ముగ్గురు విద్యార్థులు..
తమిళనాడు రాష్ట్రంలో నీట్ మరణాలు కొనసాగుతున్నాయి. ఇటీవల జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గత రెండు రోజుల్లో ఇలా బలవన్మరణాలకు పాల్పడిన వారి సంఖ్య ముగ్గురుకు చేరింది.
చెన్నై కేంద్రానికి 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న విలుపురంకు చెందిన 18 యేళ్ల మోనీషా అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విద్యార్థిని గత రెండేళ్లుగా నీట్ పరీక్షా రాస్తున్నా అర్హత సాధించలేక పోయింది. దీంతో మనస్తాపం చెందిన మోనీషా ఆత్మహత్య చేసుకుంది.
అలాగే, బుధవారంనాడు తిరుపూరు, పట్టుకోట్టై ప్రాంతాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిని రితుశ్రీ, వైషియాగా గుర్తించారు. గత రెండేళ్ళలో కనీసం ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కాగా, ఈ యేడాది నీట్ పరీక్షల్లో తమిళనాడు నుంచి 59785 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.