గురువారం, 4 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 ఆగస్టు 2025 (09:03 IST)

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. ఎర్రకోటపై జెండా ఆవిష్కరణ- పాక్‌కు మోదీ వార్నింగ్ (video)

Modi
Modi
భారతదేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని శుక్రవారం అత్యంత వైభవంగా జరుపుకుంటోంది. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శుక్రవారం ఉదయం సుమారు 7:30 గంటలకు ప్రధాని మోదీ ఎర్రకోటకు చేరుకున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. 
 
ఈ సందర్భంగా పతాకావిష్కరణ జరిగిన వెంటనే, భారత వాయుసేనకు చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు ఆకాశంలో కనువిందు చేశాయి. ఒక హెలికాప్టర్ జాతీయ పతాకాన్ని ప్రదర్శించగా, మరొకటి 'ఆపరేషన్ సిందూర్' బ్యానర్‌ను ప్రదర్శిస్తూ వేదికపై పూల వర్షం కురిపించింది. అనంతరం ప్రధాని మోదీ ఎర్రకోట బురుజుల నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఇది ఆయనకు వరుసగా 12వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం కావడం విశేషం.
 
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, పొరుగుదేశం పాకిస్థాన్‌కు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్థాన్ నుంచి వస్తున్న అణు బెదిరింపులను భారత్ ఎంతమాత్రం సహించబోదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో, దశాబ్దాలుగా అమల్లో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని ఇకపై భారత్ అంగీకరించబోదని సంచలన ప్రకటన చేశారు.
 
ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. "నీళ్లు, రక్తం ఎప్పటికీ కలిసి ప్రవహించవు" అని పునరుద్ఘాటించారు. మన దేశానికి చెందిన నీటిని పాకిస్థాన్‌తో పంచుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.