శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 25 మార్చి 2021 (09:39 IST)

మాస్క్‌ లేకుంటే రూ.250 జరిమానా...ఎక్కడ?

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పురివిప్పుతోంది. ఇటీవల కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఆయా రాష్ట్రాలు కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.

కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు కరోనా నిబంధనలు పాటించకుండా.. మాస్కులు సైతం లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్నారు. దీంతో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు కచ్చితంగా ధరించేలా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

కొన్ని రాష్ట్రాల్లో జరిమానాలు కూడా విధిస్తున్నారు. తాజాగా బెంగళూరులోనూ మాస్కులు ధరించని వారికి రూ.250 జరిమానా విధించనున్నట్లు బెంగళూరు మహానగర పాలిక (బిబిఎంపి) ప్రకటించింది. కర్ణాటకలో కరోనా కేసులు ఇటీవల నుంచి భారీగా పెరుగుతున్నాయి.

దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ కట్టడికి చర్యలు ప్రారంభించింది. కరోనా నిబంధనలు పాటించని వారిపై చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు బిబిఎంపి పరిధిలో మాస్క్‌ ధరించకుంటే రూ.250 జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వేడుకలు, కార్యక్రమాల్లో పాల్గొనే వారి సంఖ్యపై ఆంక్షలు విధించింది.

వివాహ వేడుకల్లో 200 మందికి, పుట్టిన రోజు వేడుకల్లో వంద మంది, అంత్యక్రియల్లో 50 మంది పాల్గొనవచ్చని పేర్కొంది. అంతేకాకుండా ఎయిర్‌ కండిషన్డ్‌ పార్టీ హాల్స్‌, డిపార్ట్‌మెంట్‌ సోర్ట్స్‌ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే భారీగానే జరిమానా విధించనున్నారు.