ఎపుడైనా అయోధ్య తీర్పు... యూపీకి కేంద్ర బలగాలు
కొన్ని దశాబ్దాలుగా అపరిష్కృతకంగా ఉన్న అయోధ్య సమస్యకు ఏ క్షణమైనా పరిష్కారం లభించనుంది. అయోధ్యలోని రామమందిరం - బాబ్రీ మసీదు స్థల వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఏ రోజైనా తుది తీర్పును వెలువరించే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అదేసమయంలో అయోధ్య ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర హోంశాఖ చర్యలు చేపట్టింది.
ఇందులోభాగంగా, యూపీకి భారీ ఎత్తున పారా మిలిటరీ బలగాలను తరలిస్తోంది. ఇందుకోసం రాష్ట్రానికి 15 కంపెనీల అదనపు పారా మిలిటరీ దళాలను పంపించనుంది.
అలాగే, ఈ నెల 11న ఆర్ఏఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ దళాలకు చెందిన సాయుధ బలగాలను యూపీకి పంపించనున్నారు. ఈ బలగాలను సున్నిత ప్రాంతాలైన వారణాసి, కాన్పూర్, ఆజంఘడ్, అలీఘర్, లక్నో తదితర 12 ప్రాంతాల్లో మోహరింపజేయనున్నారు.