గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 మే 2020 (19:24 IST)

జూన్ - జూలై నెలల్లో కరోనా విశ్వరూపం : ఎయిమ్స్ చీఫ్ రణదీప్

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వచ్చే జూన్, జూలై నెలల్లో విశ్వరూపం చూపించక తప్పదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గత కొన్నిరోజులుగా దేశంలో కరోనా వ్యాపిస్తున్న తీరు చూస్తుంటే ఎవరికైనా ఆందోళన కలగకమానదు. 
 
రెండు వారాల కిందటి వరకు రోజుకు వెయ్యి కేసులు నమోదవుతుండగా, ఇప్పుడు రోజుకు 3 వేల కేసుల వరకు వెలుగు చూస్తున్నాయనీ, ఇదే తరహాలో మున్ముందు కేసుల నమోదు కొనసాగినట్టయితే ఖచ్చితంగా కరోనా వైరస్ విశ్వరూపం చూపిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. 
 
జూన్, జూలై మాసాల్లో దేశంలో కరోనా పతాకస్థాయికి చేరే అవకాశాలున్నాయని అన్నారు. అందుబాటులో ఉన్న అంచనాలు, సమాచారం, పెరుగుతున్న కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే రాబోయే రోజుల్లో కరోనా ఉద్ధృతి తీవ్రమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
 
అయితే, ఈ పెరుగుదలపై వివిధ అంశాలు ప్రభావం చూపే అవకాశముందని, అవి ఎంతమేర ప్రభావం చూపిస్తాయన్నది కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. లాక్‌డౌన్ పొడిగింపు ప్రభావం ఎంతనేది కూడా మరికొన్ని రోజులు గడిస్తే కానీ చెప్పలేమన్నారు. 
 
కాగా, మన దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు 52 వేలు దాటిపోయాయి. దేశవ్యాప్తంగా 1,783 మరణాలు సంభవించాయి. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 35,902 కాగా, 15,266 మంది డిశ్చార్జి అయ్యారని గుర్తుచేశారు.
 
మరోవైపు దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో కూడా ఈ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే మూడు వేలకు పైగా ప్రజలు ఈ వైరస్ బారినపడ్డారు. గురువారం కొత్తగా 61 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,059కి చేరింది. 
 
ఈ మొత్తం కేసులలో 1130 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, 61 మంది మరణించారు. మిగతా 1868 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, యూపీలోని మొత్తం 75 జిల్లాలకుగాను 67 జిల్లాల్లో కరోనా ప్రభావం చూపిందని, మిగతా 8 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఉత్తరప్రదేశ్‌ ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి అమిత్‌ మోహన్‌ ప్రసాద్‌ వెల్లడించారు.