గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (12:43 IST)

కేంద్ర ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ రద్దు.. ఆఫీసులకు రావాలని ఆదేశం

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రభుత్వశాఖలకు చెందిన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యాన్ని కల్పించింది. ముఖ్యంగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సింహభాగం తమ ఇళ్ళ వద్ద నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇకపై ఉద్యోగులంద‌రూ ఆఫీసుల‌కు రావాల‌ని కేంద్ర సిబ్బంది వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది. 
 
దేశంలో క‌రోనా కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గడంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే కంటైన్మెంట్ జోన్ల‌లో ఉన్న వాళ్ల‌కు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇప్ప‌టివ‌ర‌కూ అండ‌ర్ సెక్ర‌ట‌రీ, ఆపై స్థాయి అధికారులు మాత్రమే ఆఫీసుల‌కు వ‌స్తున్నారు. క‌రోనా కార‌ణంగా గ‌తేడాది మార్చి నుంచి ఇదే విధానం అమ‌లు చేస్తున్నారు. 
 
ఇక గ‌తేడాది మేలో డిప్యూటీ సెక్ర‌ట‌రీ కంటే త‌క్కువ స్థాయి ఉద్యోగుల్లో 50 శాతం మందిని ఆఫీసుల‌కు రావాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. అయితే తాజా ఆదేశాల ప్ర‌కారం ఇక నుంచి అన్ని స్థాయిల అధికారులు ఆఫీసుల‌కు వెళ్లాల్సిందే. 
 
కాక‌పోతే ఆయా శాఖ‌ల విభాగాధిప‌తులు సూచించిన మేర‌కు వివిధ స‌మ‌యాల్లో ఆఫీసులకు వెళ్లాల్సి ఉంటుంది. బ‌యోమెట్రిక్ అటెండెన్స్ విధానం మాత్రం ప్ర‌స్తుతానికి అమ‌లు చేయ‌డం లేదు. ఇక అన్ని శాఖ‌ల క్యాంటీన్ల‌ను కూడా తెరుచుకోవ‌చ్చ‌ని తాజా ఆదేశాల్లో కేంద్రం స్ప‌ష్టంచేసింది.