ఒకే రేఖపై నాలుగు గ్రహాలు.. 23న చంద్రుడు కూడా.. అది సువర్ణావకాశం..?
అంతరిక్షంలో అద్భుతం జరిగింది. ఒకే రేఖపై నాలుగు గ్రహాలు కనిపించాయి. దీనిని ప్లానెట్స్ పరేడ్ అని అంటారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో స్పార్క్ ఫౌండేషన్ చిత్రీకరించింది. బుధవారం తెల్లవారు జామున 3.49 గంటల నుంచి 5.06 గంటల మధ్య నాలుగు గ్రహాలు ఒకే రేఖపైకి వచ్చి కనువిందు చేసింది.
అంతకుముందు శని, అంగారక, శుక్ర గ్రహాలు ఒకే రేఖపైకి రావడం మార్చి చివరిలో ప్రారంభమైంది. ఏప్రిల్‌లో బృహస్పతి అదే రేఖపైకి వచ్చి చేరింది. నాలుగు గ్రహాలు ఒకే రేఖపై దర్శనమివ్వడం అత్యంత అరుదైన విషయమని ఆస్ట్రనామికల్ వింగ్ డైరెక్టర్ ఎస్.సాయి సందీప్ వెల్లడించారు.
ఈ నెల 23న నాలుగు గ్రహాల చెంతకు చంద్రుడు వచ్చి చేరడంతో అంతకు మించిన అద్భుతం ఆవిష్కృతం కానుందన్నారు. ప్రస్తుతం సరళరేఖ కుడిపక్కన చంద్రుడు కనిపిస్తున్నాడు. ఐదు గ్రహాలను ఒకే వరుసగా చూడటం ప్రజలకు సువర్ణ అవకాశమని సాయిసందీప్ చెప్పుకొచ్చారు.