1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PYR
Last Modified: గురువారం, 29 జనవరి 2015 (05:53 IST)

మోదీ మోసం చేశారు..! మళ్ళీ లోక్ పాల్ ఉద్యమం : అన్నా హజారే

మరోమారు మోసపోయామనీ, స్విస్ బ్యాంకులో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి  తీసుకురావటంలో మోదీ సర్కారు పూర్తిగా విఫలమైందనీ లోక్ పాల్ ఉద్యమ నేత అన్నాహజారే ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోమారు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన చెప్పారు. 
 
ఆయన తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో ఎన్‌డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా అంశాలు చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మోదీ ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా నల్లధనాన్ని వెనక్కి తీసుకు రావటమే కాకుండా ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు డిపాజిట్ చేయాలన్నారు. అది ఏమైంది. ఎందుకు తీసుకురాలేక పోయారని ప్రశ్నించారు. ఆయన తీసుకురాలేక పోవడం విషయం అలా ఉంచితే, తాము మోదీ చేతిలో మోసపోయామన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని పిలుపునిచ్చారు. 
 
ఢిల్లీ ఎన్నికల్లో తలపడుతున్న ఒకప్పటి తన అనుచరులు కేజ్రీవాల్, కిరణ్ బేడీల గురించి మాట్లాడటానికి ఆయన నిరాకరించారు. ఢిల్లీ ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారన్న దానిపై తనకు ఆసక్తి లేదన్నారు. పార్టీ రాజకీయాల ద్వారా ఎవరూ ఎలాంటి మార్పూ తీసుకురాలేరన్నారు. లోక్‌పాల్ చట్టంపై రాష్ట్రపతి సంతకం చేసి 365 రోజలైనా మోదీ ప్రభుత్వం దాన్ని అమల్లోకి తేలేదని అరోపించారు. లోక్‌పాల్, భూసేకరణ చట్టం తదితర అంశాలపై మళ్లీ ఆందోళన చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.