మరోరోజు 40వేల పైనే కరోనా కొత్త కేసులు
దేశంలో రెండోరోజు కరోనా కేసులు 40వేలకు పైనే వెలుగుచూశాయని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ కూడా 600పైనే మరణాలు సంభవించాయి. అలాగే రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా 17,28,795 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 43,509 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.15కోట్ల మార్కును దాటాయి. కేరళలో 22వేల కేసులు, మహారాష్ట్రలో 6,857 కేసులు బయటపడ్డాయి. దేశంలో నమోదవుతోన్న కొత్త కేసుల్లో ఈ రెండు రాష్ట్రాలదే సగానికిపైగా వాటా ఉంటోంది.
కొవిడ్ ధాటికి నిన్న మరో 640మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 4.22లక్షలకు చేరింది.
నిన్న 38,465 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తంమీద 3.07కోట్ల మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 97.38 శాతంగా ఉంది.
ప్రస్తుతం 4,03,840 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. మరోసారి క్రియాశీల కేసులు నాలుగులక్షలకు ఎగువన నమోదయ్యాయి. క్రియాశీల రేటు 1.28 శాతానికి చేరింది.
నిన్న 43,92,697 మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటి వరకు పంపిణీ అయిన టీకాల సంఖ్య 45కోట్ల మార్కు దాటింది.