కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు
దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. క్రితం రోజు 35వేలకు దిగొచ్చిన కేసులు తాజాగా మళ్లీ పెరిగాయి. అంతేగాక, వైరస్ నుంచి కోలుకున్నవారి కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 16.31లక్షల మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా.. 39,097 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 3.13 కోట్లు దాటాయని కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. ఇదే సమయంలో 35,087 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 3.05కోట్ల మంది కరోనాను జయించారు. రికవరీ రేటు 97.35శాతంగా ఉంది.
24 గంటల వ్యవధిలో మరో 546 మందిని కొవిడ్ బలితీసుకుంది. మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 4,20,016 మంది మృత్యువాత పడ్డారు. ఇక కొత్త కేసులు అధికమవడంతో యాక్టివ్ కేసులు కూడా స్వల్పంగా పెరిగాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,08,977 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.31శాతానికి చేరింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కాస్త పుంజుకున్నట్లే కన్పిస్తోంది. శుక్రవారం 42.67లక్షల మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటివరకు 42.78కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.