సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 14 జూన్ 2021 (20:53 IST)

గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో కేసులు నిల్‌: అనిల్‌కుమార్ సింఘాల్

అమరావతి: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలకు గానూ 3,540 వార్డు, గ్రామ సచివాలయాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. 104 కాల్ సెంటర్, టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా రెండు నెలల కాలంలో 11.50 లక్షల అవుట్ గోయింగ్, ఇన్ కమింగ్ ఫోన్ కాల్స్ ద్వారా కరోనా బాధితులకు వైద్యులు సలహాలు సూచనలు అందజేశారన్నారు.

కరోనా విధి నిర్వహణలో అశువులు బాసిన వైద్య సిబ్బందికి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ ఎక్స్ గ్రేషియా అందజేయాలని నిర్ణయించిందన్నారు. ఇందుకు సంబంధించిన ఉత్వర్వులను జారీచేసిందన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 87,756 శాంపిళ్లు పరీక్షించగా, 4,549 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 59 మంది మృతి చెందారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80,013 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.

వివిధ ఆసుపత్రుల్లో 15,579 మంది, కొవిడ్ కేర్ సెంటర్లలో 7,798 మంది, హోం ఐసోలేషన్‌లో 56,636 మంది వైద్య సేవలు పొందుతున్నారన్నారు. 449 ఆసుపత్రుల్లో ప్రస్తుతం కొవిడ్ వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,440 ఐసీయూ బెడ్లు, 12,417 ఆక్సిజన్ బెడ్లు, సాధారణ బెడ్లు. 11 వేలు ఖాళీగా ఉన్నాయన్నారు. అన్ని జిల్లాల్లోనూ ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 370 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను వినియోగించుకున్నామన్నారు. గడిచిన 24 గంటల్లో హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న 14,367 మందితో టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా వైద్యులు ఫోన్లో మాట్లాడి, వారి ఆరోగ్య స్థితులను ఆరా తీసి, మందుల వినియోగంపై సలహాలు సూచనలు అందజేశారన్నారు. 
 
11.50 లక్షల ఫోన్ కాల్స్ ద్వారా సలహాలు సూచనలు...
104 కాల్ సెంటర్, టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా గత రెండు నెలల కాలంలో 11.50 లక్షల అవుట్ గోయింగ్, ఇన్ కమింగ్  కాల్స్ ద్వారా కరోనా బాధితులకు సలహాలు సూచనలు అందజేసినట్లు ఆయన తెలిపారు. 104 కాల్ సెంటర్  ను ఏప్రిల్ 16వ తేదీన మరింతగా అభివృద్ధిపరిచి కరోనా ఇబ్బందులుపై ఫోన్ చేయాలని పిలుపునిచ్చామన్నారు. ఆనాటి నుంచి గడిచిన 24 గంటల వరకూ రెండు నెలల కాలంలో 5.02.813 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు.

హోం ఐసోలేషన్ లో చికిత్సపొందుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద తమ పేర్లను రిజిస్ట్రర్ చేసుకున్న వైద్యులు 6.50 లక్షల ఫోన్ల కాల్స్ చేశారన్నారు. ఇలా  అవుట్ గోయింగ్, ఇన్ కమింగ్ కాల్స్ కలిపి 11.50 లక్షల ఫోన్ల కాల్స్ ద్వారా కరోనా బాధితులకు వైద్య సేవలు, మందుల వినియోగం, వివిధ ఆసుపత్రుల్లో చేరికకు సిఫార్సులు వంటివి చేశారన్నారు. గడిచిన 24 గంటల్లో 104 కాల్ సెంటర్ కు 2,461 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. వాటిలో 1,632 కాల్స్ వివిధ సమాచారాల కోసం ఫోన్లు వచ్చాయన్నారు. 
 
కోవిడ్‌తో మృతి చెందిన వైద్య సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక భరోసా...
కొవిడ్ విధుల్లో పాల్గొంటున్న వైద్య సిబ్బందికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారన్నారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు కరోనా కారణంగా మృతి చెందిన వైద్య సిబ్బందికి భారీ మొత్తంలో ఎక్స్ గ్రేషియా ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ జీవో జారీచేసిందన్నారు. కొవిడ్‌ విధి నిర్వహణలో మృతి చెందిన వైద్యుని కుటుంబానికి రూ.25 లక్షలు, స్టాఫ్‌ నర్సు కుటుంబానికి రూ.20 లక్షలు, ఎఫ్‌ఎన్ఓ, ఎమ్‌ఎన్ఓలకు రూ.15 లక్షల ఎక్స్‌ గ్రేషియా చెల్లించాలని నిర్ణయించిందన్నారు.

ఇతర వైద్య సిబ్బంది మృతి చెందితే రూ.10 లక్షల ఎక్స్‌ గ్రేషియా ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు.  కేంద్ర ప్రభుత్వం చెల్లించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకానికి అదనంగా ఈ ఎక్స్‌ గ్రేషియా చెల్లించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొందన్నారు. తక్షణమే ఎక్స్‌ గ్రేషియా అందేలా జిల్లా కలెక్టర్లకు అధికారం అప్పగించిందన్నారు. ఇతర ఇతర బీమా పరిహారాలు పొందినా సరే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్ గ్రేషియో అందజేస్తామన్నారు.
 
పెరుగుతున్న ‘ఆరోగ్య శ్రీ’ సేవలు..
ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,17,97,000 కరోనా టీకాలు వేశామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వారిలో రెండు డోసులు వేసుకున్న వారు 26,20,000 మంది, ఒక డోసు వేసుకున్నవారు  65,56,000 మంది ఉన్నారన్నారు. 45 ఏళ్లు లోపు ఉన్నా అయిదేళ్లలోపు పిల్లలు కలిగిన తల్లులు 18.70 లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నామన్నారు. వారిలో ఇప్పటి వరకూ 3,16,511 మంది తల్లులకు టీకా వేశామన్నారు. విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు, ఉద్యోగులకు  7495 మందికి టీకా వేశామన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకం కింద కరోనా చికిత్సలు పొందే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో ప్రస్తుతం 16,112 మంది చికిత్స పొందుతుండగా, వారిలో 14,359 మంది (89.12 శాతం) ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు పొందుతున్నారన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రస్తుతం 6,062 మంది చికిత్స పొందుతుంటే, వారిలో 4,309 మంది (71 శాతం) ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవలు పొందుతున్నారన్నారు. 
 
3,540 వార్డు, గ్రామ సచివాలయాల్లో కరోనా కేసులు నిల్...
రాష్ట్రంలో కరోనా రోజు రోజుకూ తగ్గుముఖం పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఉన్న వార్డు, గ్రామ సచివాలయాల వారీగా డేటా పరిశీలిస్తే కేసులు తగ్గుతున్నాయనేది అవగతమవుతుందన్నారు. రాష్ట్రంలో 15 వేల వార్డు, గ్రామ సచివాలయాలు ఉన్నాయన్నారు. వాటిలో గడిచిన 24 గంటల్లో 3,540 సచివాలయాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. కేవలం ఒక్క కేసు 2,637 సచివాలయాల్లో, రెండు కేసులు 1,961 సచివాలయాలు, మూడు కేసులు 1500 సచివాలయాల్లో నమోదయ్యాయన్నారు.

సున్నా నుంచి 3 కేసుల వరకూ 9 వేల పైన సచివాలయాల్లో(60 శాతంపైగా) నమోదయ్యాయన్నారు. 15 సచివాలయాల్లో 50 కేసులు, 18 సచివాలయాల్లో 40 కేసులు, 40 సచివాలయాల్లో 30 కేసులు నమోదయ్యాన్నారు. ఇలా 70 సచివాలయాలు... 0.5 శాతంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్ధేశం చేశారన్నారు. కేసులు తగ్గుతున్నాయని 104 కాల్ సెంటర్ నిర్వహణపైనా, ఫీవర్ సర్వేపైనా నిర్లక్ష్యం చూపొద్దని, ప్రస్తుతమున్న స్ఫూర్తిని మరికొంతకాలం పాటు పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారన్నారు.

రాష్ట్రంలో నేటి వరకూ 2,303 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని, వాటిలో 1,328 యాక్టివ్ కేసులు అని తెలిపారు. ఈ కేసుల్లో 538 మందికి ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు, 577 మందికి పొసకొనజోల్ ఇంజక్షన్లు ఇస్తున్నామన్నారు. 157 మంది మృతిచెందారని తెలిపారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 32,285 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు అన్ని జిల్లాలకు కేటాయించామని, ప్రస్తుతం 10,759 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 49,250 పొసకొనజోల్ ఇంజక్షన్లు, 1,39,980 పొసకొనజోల్ ట్యాబ్ లెట్లు అన్ని జిల్లాలకు అందజేశామన్నారు.
 
అన్ని టీచింగ్ ఆసుపత్రుల్లోనూ అదనంగా  పిడియాట్రిక్, ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేయాలని సోమవారం నిర్వహించిన కొవిడ్ సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. ఇపుడున్న ఐసీయూ బెడ్ల కంటే అదనంగా ఐసీయూ బెడ్లు పెంచాలన్నారు. ఆరు నెలల చిన్నారుల కోసం అవసరమైన బెడ్ల పెంపుదలపైనా చర్చించామన్నారు. ప్రైవేటు టీచింగ్ ఆసుపత్రుల్లో అదనపు బెడ్లు, సిబ్బంది నియామకంపైనా అధికారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశా నిర్ధేశం చేశారన్నారు.

ఆరోగ్య శ్రీ పథకంలో పిడియాట్రిక్ కేసుల చేర్పుపైనా సీఎం సమీక్షా సమావేశంలో చర్చించామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లలో సూపర్ స్పెషాలిటీ, మల్లీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి అయిదు ఎకరాల గుర్తింపుపైనా సీఎం సమీక్షా సమావేశంలో చర్చించామన్నారు. 16 మున్సిపల్ కార్పొరేషన్లలో 11, 12 చోట్ల భూములు గుర్తించామన్నారు. యూనిట్ ఖరీదు, సౌకర్యాల కల్పన, సిబ్బంది నియామకంపై రెండు వారాల్లో విధి విధానాలు ఖరారు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. రాష్ట్రంలో కొత్తగా 19 చోట్ల ఆర్టీపీసీఆర్ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో కేవలం ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ల్యాబ్ లు ఏర్పాటు చేస్తోందన్నారు.