ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 డిశెంబరు 2021 (13:52 IST)

కుప్పకూలిన హెలికాఫ్టర్‌లో భారత త్రివిధ దళపతి బిపిన్ రావత్... పరిస్థితేంటి?

తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కున్నూరుకు సమీపంలోని కాట్టేరి అనే అటవీ ప్రాంతంలో భారత రక్షణ శాఖకు చెందిన ఓ హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ హెలికాఫ్టర్‌లో మొత్తం 14 మంది వరకు ప్రయాణించినట్టు సమాచారం. వీరిలో భారత ఆర్మీ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ కూడా ఉన్నారు. అయితే, ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, బిపిన్ రావత్ పరిస్థితి మాత్రం తెలియడం లేదు. 
 
ఈ హెలికాఫ్టర్ కున్నూరు నుంచి వెల్లింగ్టన్‌కు బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో బయలుదేరింది. అయితే, ఈ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కాట్టేరి అనే ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాఫ్టర్ కాలిబూడిదైంది. అయితే, ఈ హెలికాఫ్టర్‌లో ఉన్న ఆర్మీ అధికారుల పరిస్థితి ఏమిటో తెలియడం లేదు. ముఖ్యంగా, బిపిన్ రావత్ పరిస్థితి ఏంటో తెలియడం లేదు.
 
గత కొన్ని రోజులుగా ఈ జిల్లాలో దట్టమైన పొగమంచు అలుముకునివుంది. దీనికితోడు హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్టు సమాచారం. ఈ కారణంగానే హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి ఆర్మీ అధికారులు తప్పించుకున్నారా లేదా అనేది తెలియాల్సివుంది.