1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 9 ఆగస్టు 2023 (08:35 IST)

మహిళలపై అఘాయిత్యానికి పాల్పడితే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు!!

ashok gehlot
దేశంలోని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి. ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ కొనసాగుతున్నారు. ఈయన సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు అనర్హులని ప్రకటించింది. మహిళలపై నేరాలను అరికట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని, అందుకే ఈ తరహా కఠిన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాగే, ప్రతి పోలీస్ స్టేషన్‌లో లైంగిక దాడులకు పాల్పడిన నేరస్థుల వివరాలతో పాటు ఫోటోలను కూడా ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. 
 
ఇదే అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వమని తెలిపారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని తెలిపారు. 
 
కాగా, త్వరలో రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందు మహిళల భద్రతపై కఠినమైన సందేశం ఇచ్చారు. మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారికి, ఆయా ఘటనలతో ప్రేమేయం ఉన్నవారికి, లైంగిక దుష్ప్రవర్తన కలిగినవారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదని నిర్ణయించినట్టు చెప్పారు.
 
ప్రతి పోలీస్ స్టేషన్‌‍లో లైంగిక నేరస్థుల జాబితాను పెట్టనున్నట్టు తెలిపారు. ఉద్యోగానికి ఎంపిక చేసేముందు స్థానిక పోలీస్ స్టేషన్లు లేదా ప్రభుత్వం జారీచేసిన నడవడిక ధృవపత్రాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయంటూ ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ తరహా కఠిన నిర్ణయం తీసుకోవడం గమనార్హం.