శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 8 మే 2023 (12:27 IST)

మా సర్కారు కుప్పకూలిపోకుండా ఆమె అడ్డుపడ్డారు : గెహ్లాట్ ప్రకటన

ashok gehlot
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 2020లో తమ ప్రభుత్వం కుప్పకూలిపోకుండా బీజేపీ మహిళా నేత, మాజీ ముఖ్యమంత్ర వసుంధరా రాజే అడ్డుపడ్డారన్నారు. ఈ మేరకు ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసమ్మతి లేవనెత్తిన ఆ సమయంలో ఆ పార్టీకి చెందిన మాజీ స్పీకర్ కైలాస్ మేఘ్వాల్, ఎమ్మెల్యే శోభారాణి కుశ్వాహ్ తనకు అనుకూలంగా వ్యవహరించారని తెలిపారు. తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేపట్టిన భాజపా అధిస్థానం యత్నాలను వారు ముగ్గురూ తీవ్రంగా వ్యతిరేకించారని, ఈ చర్యలను వసుంధర రాజే ప్రతిఘటించారని చెప్పారు. 
 
తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బైరాన్ సింగ్ షెఖావత్ ప్రభుత్వాన్ని అస్థిరపరచే చర్యలకు ఏనాడూ మద్దతివ్వలేదని తెలిపారు. అదేపద్ధతిని వారూ అనుసరించారని గుర్తు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, ధర్మేంద్ర ప్రధాన్ తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రపన్నారని గెహ్లాట్ ఆరోపించారు. 
 
వారు ఎమ్మెల్యేలకు డబ్బులు పంచారని, ఆ డబ్బులను ఇప్పటికీ వెనక్కి తీసుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2020 జులైలో అప్పటి ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్, మరో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెహ్లాట్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన విషయం తెల్సిందే. సుమారు నెలపాటు సాగిన ఆ సంక్షోభానికి అధిష్టానం జోక్యంతో తెరపడింది. ఆ ఘటనతో సచిన్ పైలట్‌ను ఉపముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవుల నుంచి తొలగించారు.