బాహుబలి భుజంపై చంద్రుడు : అస్సాం పోలీసుల మార్ఫింగ్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇటీవల చంద్రమండలం లోగుట్టును తెలుసుకునేందుకు చంద్రయాన్-2 పేరుతో ఓ ఉపగ్రహాన్ని పంపించింది. ఈ నెల 22వ తేదీన చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతంగా ముగిసింది. ఈ రాకెట్ వచ్చే సెప్టెంబరు ఏడో తేదీన చంద్రమండలంపై దిగనుంది. దీనికంటే ముందుగానే అంటే ఆగస్టు నెలలోనే చంద్రయాన్ 2 మిషన్ జాబిల్లిపై దిగేలా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
ఇదిలావుంటే, అస్సాం పోలీసులకు వినూత్న ఆలోచన వచ్చింది. అంతే.. ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రంలో ప్రభాస్ శివలింగాన్ని భుజంపై పెట్టుకుని మోస్తాడు. ఇపుడు ప్రభాస్ భుజంపై శివలింగానికి బదులు చంద్రుడిని మోస్తున్నట్టుగా మార్ఫింగే చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ఇపుడు వైరల్ అవుతోంది.
మరోవైపు, వచ్చే కొన్ని వారాల్లో చంద్రయాన్-2కు పలు కీలక దశలను చేపట్టనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఆగస్టు 14న చంద్రయాన్-2ను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు, ఆగస్టు 20న ఇది చంద్రుడి స్థిర కక్ష్యలోకి చేరనున్నట్లు వివరించింది. సెప్టెంబరు 7వ తేదీన ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై అడుగిడనుంది.
అదేసమయంలో ఇస్రో మిషన్ కంట్రోల్ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఓ వైపు చంద్రయాన్-2ను జాగ్రత్తగా జాబిల్లి దిశగా చేరుస్తుండగా, మరోవైపు ఇస్రో ఉన్నతాధికారులు, ప్రభుత్వ ముఖ్యనేతలు చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ విక్రమ్ దిగే స్థలానికి ఏ పేరు పెట్టాలా అని అన్వేషిస్తున్నారు. ఇస్రో వాణిజ్య విభాగమైన యాంట్రిక్స్ కార్పొరేషన్ గత మూడేండ్లలో 239 ఉపగ్రహాలను ప్రయోగించిందని, దీని ద్వారా రూ.6,289 కోట్ల ఆదాయం సమాకూరినట్లు ప్రభుత్వం బుధవారం పార్లమెంట్‌కు వెల్లడించింది.