బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 మే 2022 (20:08 IST)

మహిళా న్యాయవాదిపై దాడి - కేఎస్‌హెచ్ఆర్‌సీ నోటీసులు

attack on woman advocate
ఇటీవల ఆస్తి వివాదంపై బాగల్‌కోట్‌లో ఓ మహిళా న్యాయవాదిపై ఇద్దరు వ్యక్తులు నడిరోడ్డుపై దాడికి పాల్పడ్డారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన కర్నాటక రాష్ట్ర మానవహక్కుల కమిషన్ పోలీసులు, ఇతర అధికారులకు నోటీసులు పంపింది. 
బాధితురాలు సంగీతా షిక్కేరి ఇచ్చిన ఫిర్యాదుపై కేఎస్‌హెచ్‌ఆర్‌సీ స్పందించింది. 
 
దీన్ని స్వీకరించిన కేఎస్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్‌పర్సన్ జస్టిస్ డీహెచ్ వాఘేలా మాట్లాడుతూ.. "ఫిర్యాదులో చేసిన ఆరోపణలు నిజమైతే, అది బాధితుల మానవ హక్కులను ఉల్లంఘించినట్లే" అని అభిప్రాయపడ్డారు. షిక్కేరిపై మహంతేష్ చోళచగూడ అనే వ్యక్తి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెల్సిందే.

ఈ ఘటన మే 8వ తేదీన బాగల్‌కోట్‌లో జరిగింది. ఈ దాడికి పాల్పడిందికూడా బీజేపీ జనరల్ సెక్రటరీ రాజు నాయకర్. ఈయన తన అనుచరులతో కలిసి ఆమె నివాసంలోకి ప్రవేశించి వారిని అక్రమంగా నిర్బంధించడమే కాకుండా, ఆమెపై దాడి చేశారు.
 
బాధితురాలి కుటుంబం రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. బాధితారుల నివాసం ఉంటున్న వివాదాస్పద ఆస్తిని బలవంతంగా స్వాధీనం చేసుకునే లక్ష్యంతో అక్రమార్కులు షిక్కేరి మరియు ఆమె భర్తను శారీరకంగా హింసించారని, ఆస్తిని ధ్వంసం చేసి రూ.10 లక్షల వరకు నష్టం చేకూర్చారని ఆరోపించారు. 
 
ఆ వ్యక్తులు కుటుంబ సభ్యులను బెదిరించారని, షిక్కేరి తల్లి నమ్రతపై ఆగ్రహం వ్యక్తం చేశారని, అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
హనుమంతప్ప సింగప్ప షిక్కేరి ప్రోద్బలంతో హుబ్లీ విద్యుత్ సరఫరా సంస్థ (హెస్కామ్) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అరవింద్ నాయక్, పట్టణ మున్సిపల్ వాటర్ సప్లై ఇంజనీర్ ఖాజీ ఇంటికి విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేశారని పేర్కొన్నారు. 
 
మే 13న ప్రాథమిక ఫిర్యాదును దాఖలు చేసిన తర్వాత, మే 16న షిక్కేరి తరపున న్యాయవాది సుధా కత్వ మరో ఫిర్యాదు చేశారు. బాగల్‌కోట్ పోలీస్ స్టేషన్‌లో నాయకర్‌తో పాటు ఇతరులపై ఫిర్యాదు చేసినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కత్వా పేర్కొన్నారు. ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) నుంచి నాయకర్‌ పేరు తొలగించారు.
 
 వీటిపై స్పందించిన హ్యూమన్ రైట్స్ కమిషన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, హెస్కామ్ మేనేజింగ్ డైరెక్టర్, బాగల్‌కోట్ టౌన్ మునిసిపాలిటీ కమిషనర్‌కు నోటీసు జారీ చేసి, వచ్చే నెల 7వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.