శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (19:31 IST)

మోడీ స్టేడియమంత గ్రహశకలం భూమివైపు దూసుకొస్తుంది... ముప్పు తప్పదా?

apophis
ఆకాశం నుంచి అహ్మదాబాద్ నగరంలో ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిర్మించిన నరంద్ర మోడీ క్రికెట్ స్టేడియమంతా గ్రహశకలం భూమివైపు దూసుకొస్తుంది. ఈ గ్రహశకలాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు ఆ సంస్థ ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ తెలిపారు. ఇది 2029లో భూమికి అతి సమీపం నుంచి ప్రయాణించవచ్చని, ఈ గ్రహశకలం పేరు అపోఫిస్ అని తెలిపారు. మరోవైపు, ఈ గ్రహశకలం ద్వారా భూమికి పొంచివున్న ముప్పును నివారించేందుకు ఏ దేశం ముందుకు వచ్చినా తాము పూర్తిగా సహకారం అందిస్తామని సోమనాథ్ తెలిపారు. 
 
ఈ అపోఫిస్ ఆస్టరాయిడ్‌ భూమికి 32,000 కిలోమీటర్ల ఎత్తులో వెళుతుందని, అంటే భారత జియోస్టేషనరీ శాటిలైట్స్ పరిభ్రమించే కక్ష్యల కంటే దగ్గరగా ఈ ఆస్టరాయిడ్ ప్రయాణించే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఇక, పరిమాణం పరంగా చూస్తే ఇంత పెద్ద గ్రహశకలం గతంలో ఎప్పుడూ భూమికి ఇంత సమీపం నుంచి వెళ్లలేదని వివరించారు. 
 
ఇది భారత అతిపెద్ద విమాన వాహక నౌక అయిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య కంటే కూడా పెద్దగా ఉంటుందన్నారు. ఈ గ్రహశకలం పరిమాణం సుమారు 340 - 450 మీటర్ల వ్యాసం కలిగి ఉండొచ్చని చెప్పారు. 140 మీటర్ల వ్యాసం కంటే పెద్దగా ఉన్న ఏ గ్రహశకలం భూమికి సమీపం నుంచి ప్రయాణించినా ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారని సోమనాథ్ చెప్పారు.
 
ఒక భారీ ఆస్టరాయిడ్ మానవాళి మనుగడకు ముప్పు అని, ఆ ముప్పును ఎదుర్కొనే విషయంలో ఇస్రో క్రియాశీలకంగా ఉందని ఆయన చెప్పారు. నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ ఆస్టరాయిడ్ 'అపోఫిస్'ను నిశితంగా పర్యవేక్షిస్తోందని ఆయన చెప్పారు. భవిష్యత్తులో భూమికి పొంచివుండే ముప్పులను నివారించేందుకు భారత్ సిద్ధమని, ఈ మేరకు అన్ని దేశాలకు తమ సహకారం అందిస్తామని సోమనాథ్ చెప్పారు.
 
300 మీటర్ల కంటే పెద్దగా ఉంటే గ్రహశకలం ఖండాలను నాశనం చేసే అవకాశం ఉంటుందని, ఇక 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ వ్యాసం ఉండే గ్రహశకలాలు ఢీకొంటే భూమి వినాశనం అవుతుందని చెప్పారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అపోఫిస్'ను తొలిసారి 2004లో గుర్తించారు. విలయాలు సృష్టిస్తాడని ఈజిప్ట్ ప్రజలు భావించే 'అపోఫిస్' అనే దేవుడి పేరును ఈ గ్రహశకలానికి పెట్టారు.