శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (19:20 IST)

హర్యానా అసెంబ్లీ ఎన్నికలు : వినేశ్ ఫొగాట్‌పై పోటీ ఎవరంటే?

haryana state
హర్యానా అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆయా పార్టీలు విడుదల చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. ఇందులో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ను బరిలోకి దించింది. అయితే, మంగళవారం బీజేపీ తన అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో యూత్‌ లీడర్ కెప్టెన్‌ యోగేశ్‌ బైరాగిని బరిలో దింపింది. దాంతో అక్కడ వినేశ్‌ వర్సెస్ యోగేశ్‌గా మారింది.
 
హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 సీట్లు ఉండగా, 21 మంది అభ్యర్థులతో భాజపా రెండో జాబితాను విడుదల చేసింది. అందులోనే జులానా నుంచి యోగేశ్‌కు టికెట్‌ కేటాయించినట్టు వెల్లడించింది. ఆయన భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు. భాజపా స్పోర్ట్స్‌ సెల్ హర్యానా విభాగానికి కో కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. జింద్ జిల్లాకు చెందిన యోగేశ్ తన ఫేస్‌బుక్ బయోలో మాజీ పైలట్‌గా పేర్కొన్నారు. భాజపా ఇప్పటికే 67 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
 
భారత స్టార్‌ రెజ్లర్లు వినేశ్‌ ఫొగాట్‌, బజరంగ్‌ పునియాలు ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్‌ నేతల సమక్షంలో వీరిద్దరూ కాంగ్రెస్‌ కండువా వేసుకున్నారు. దీనికి ముందు ఈ రెజ్లర్లు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. మరోవైపు, పార్టీలో చేరడానికంటే ముందే.. భారత రైల్వేలో ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగాలకు వినేశ్‌, పునియా రాజీనామా చేశారు. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాలో వినేశ్‌ పేరును కాంగ్రెస్ ప్రకటించింది. మరో రెజ్లర్‌ బజరంగ్‌ పునియాకు ఆల్‌ ఇండియా కిసాన్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పజెప్పింది. గత శుక్రవారం హస్తం పార్టీ 31 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది.