సోమవారం, 2 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 మార్చి 2021 (15:57 IST)

73 యేళ్ళ వయసులో వరుడు కావాలంటున్న బామ్మ!

ఆమె వయసు 73 యేళ్లు. ఆమె పేరు తెలియదుగానీ.. ఉంటున్నది మాత్రం కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో. ఈమె ఇపుడు వరుడు కావాలంటూ ఓ ప్రకటన ఇచ్చారు. పైగా, తనకంటే వయసులో పెద్దవాడై ఉండాలనీ, బ్రహ్మణ కులానికి చెందినవారై ఉండాలన్న షరతులు పెట్టింది. తన శేషజీవితాన్ని కాబోయే భర్తతోనే గడవాలని భావిస్తున్నట్టు ఆ వృద్ధురాలు చెప్పుకొచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్ణాటకకు చెందిన 73 యేళ్ల భామ వరుడు కావాలంటూ ప్రకటన ఇచ్చింది. ఆమె కర్ణాటకలోని మైసూరుకు చెందినవారు. ఆమె టీచర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. ఆమెకు గతంలో వివాహం జరిగినప్పటికీ, విడాకులు తీసుకున్నారని తెలుస్తోంది. ఇపుడు ఆమె ఇచ్చిన ప్రకటనలో, తనకు ఓ వరుడు కావాలని పేర్కొన్నారు. 
 
ఆరోగ్యవంతుడు, తన కన్నా పెద్ద వయసుగల వ్యక్తి కావాలని, అటువంటి వ్యక్తి తప్పనిసరిగా బ్రాహ్మణుడు అయి ఉండాలని తెలిపారు. తాను కూడా బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తినని పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు మరణించారని తెలిపారు. కొంత కాలం నుంచి తాను ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నానని చెప్పారు. 
 
తన మొదటి పెళ్లి అత్యంత బాధాకరంగా విడాకులతో ముగిసిందన్నారు. ఆ తర్వాత తాను పునర్వివాహం చేసుకోలేదన్నారు. ప్రస్తుతం బస్టాప్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాలంటే భయంగా ఉందని, ఒంటరిగా జీవించడం కష్టంగా ఉందని, అందుకే సంబంధం కోసం చూస్తున్నానని తెలిపారు. 
 
‘‘నాకు సొంత కుటుంబం లేదు. నా తల్లిదండ్రులు లేరు. నా తొలి వివాహం విడాకులతో ముగిసింది. నేను ఒంటరిగా ఉండటానికి భయపడుతున్నాను. ఇంట్లో పడిపోతే సాయం చేసేవారు ఉండరనే ఆలోచన వస్తోంది. బస్టాప్ నుంచి ఇంటికి నడవాలంటే భయమేస్తోంది. ఇలాంటి ఆలోచనలు జీవిత భాగస్వామి కోసం చూసేలా చేస్తున్నాయి’’ అని ఆ బామ్మగారు మీడియాకు చెప్పారు. తన శేష జీవితమంతా తనతో కలిసి ఉండే ఓ తోడు కావాలని తెలిపారు. 
 
కాగా, ఈ ప్రకటన ఇపుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రకటనను చూసినవారు ఆమెను అభినందించడంతోపాటు మోసగాళ్ళు ఉంటారని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. 
 
అదేసమయంలో తనకు ఓ తోడు కావాలని ప్రకటన ఇచ్చిన బామ్మ గారికి సామాజిక మాధ్యమాల్లో మద్దతు బాగా లభిస్తోంది. ఆమె సాంస్కృతికపరమైన మూస పద్ధతులను తోసిరాజని, జీవితానికి ఎక్కువ విలువ ఇస్తున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆమె నిర్ణయాన్ని యువత మరింత ఎక్కువగా స్వాగతిస్తున్నారు. వృద్ధుల పట్ల నిరాదరణ ప్రదర్శిస్తున్న సమాజానికి ఈ ప్రకటన మేలుకొలుపు అని అంటున్నారు.