1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2015 (19:46 IST)

అటల్ బిహారీ వాజ్ పేయికి భారత రత్న: చారిత్రాత్మక రోజు అని మోడీ వ్యాఖ్య!

భారత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘‘భారత రత్న’’ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 
 
అనారోగ్యంతో లేవలేని స్థితిలో ఉన్న అటల్‌జీకి భారత రత్నను ప్రదానం చేయడానికి రాష్ట్రపతి ప్రణబ్‌ ప్రొటోకాల్‌ను సైతం పక్కన బెట్టి ఆయన నివాసానికి తరలివచ్చారు. ప్రత్యేక గదిలో అచేతన స్థితిలో ఉన్న వాజ్‌పేయికి రాష్ట్రపతి తన చేతుల మీదుగా అవార్డును అందించారు.
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ అటల్‌ బిహారీ వాజ్‌పేయికి భారత రత్న అందించిన ఈ రోజు చారిత్రాత్మక రోజు అని అభివర్ణించారు. భారత రాజకీయాలో అటల్‌జీ మేరునగధీరుడని, తనలాంటి వేలాది మంది కార్యకర్తలకు ఆయన ఒక ప్రేరణ అని పేర్కొన్నారు. జాతికోసం జీవితాన్నే అంకితం చేసిన అటల్ బీహారీ వాజ్ పేయికి భారత రత్న ఇవ్వడం సముచితమేనని మోడీ వ్యాఖ్యానించారు.