65 ఏళ్ల స్నేహం.. స్కూటర్‌లో తిరిగేవాళ్లం.. పానీపూరీ తినేవాళ్లం.. అద్వానీ ఆవేదన
మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారీ వాజ్‌పేయి మృతి దేశ ప్రజలను శోక సముద్రంలో ముంచేసింది. ఇంకా అటల్ జీ మృతి.. ఆయన ఆత్మ మిత్రుడు, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీని తీవ్రంగా కలచి వేసింది. 65 ఏళ్ల పాటు స్నేహం
మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారీ వాజ్‌పేయి మృతి దేశ ప్రజలను శోక సముద్రంలో ముంచేసింది. ఇంకా అటల్ జీ మృతి.. ఆయన ఆత్మ మిత్రుడు, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీని తీవ్రంగా కలచి వేసింది. 65 ఏళ్ల పాటు స్నేహంతో మెలిగిన వీరిద్దరూ.. ఆరెస్సెస్‌లో ప్రచారక్ స్థాయి నుంచీ వారిద్దరూ కలసి పనిచేశారు.
గతకొంత కాలంగా వాజ్ పేయిని తరచుగా కలిసే అద్వానీ.. ఆయన లేరనే వార్తను ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తన ఆప్త మిత్రుడిని కోల్పోవడంతో మాటలు రావడం లేదని అద్వానీ వ్యాఖ్యానించారు. వాజ్‌పేయితో సుదీర్ఘ స్నేహబంధం అపూర్వమైంది. వాజ్‌పేయి తాను యువకులుగా ఉన్నప్పుడు స్కూటర్‌పై తిరిగే వాళ్లమంటారు అద్వానీ. తాము ఇద్దరం కలిసి పానీపూరీ చాట్ తినేందుకు ఢిల్లీలోని కనాట్ ప్లేస్‌కు వెళ్లేవారిమని గుర్తుచేసుకున్నారు.
భారత దేశ రాజకీయాల్లో తిరుగులేని కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ ఎదిగిన బీజేపీలో వాజ్‌పేయి, అద్వానీ పాత్ర కీలకం. 1980, ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించిన ఈ దిగ్గజ రాజకీయ నేతలు పార్టీ ప్రస్థానాన్ని అప్పటి నుంచి ప్రారంభించి దేశంలో పరుగులు పెట్టించారు. భారతదేశ యవనికపై బీజేపీని తిరుగులేని పార్టీగా నిలిపారు.
బీజేపీకి అటల్ బిహారీ వాజపేయి తొలి అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసిన వ్యక్తి అద్వానీ. 1984లో, ఇందిరా గాంధీ హత్య తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించగా, బీజేపీ 543 నియోజకవర్గాలలో కేవలం రెండింటిని గెలుపొందింది. మతతత్వ పార్టీ ముద్రను తొలగించుకుని దేశంలో బలీయమైన శక్తిగా ఎదిగేందుకు వాజ్‌పేయి, అద్వానీ చేసిన కృషి అమోఘమంటారు రాజకీయ పండితులు.
లాల్‌కృష్ణ అద్వానీ రథయాత్రతో 1989 లోక్‌సభ ఎన్నికలలో 88 సీట్లను గెలుచుకున్నారు కమలనాథులు. 1991 లోక్‌సభ ఎన్నికలలో 120కి పెంచుకొని ప్రధాన ప్రతిపక్షంగా మారడానికి అద్వానీ, అటల్ జీల కృషే కారణం. 1996 లోక్‌సభ ఎన్నికలలో అతి పెద్ద రాజకీయ పక్షంగా అవతరించడంతో వాజ్‌పేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
1998 ఎన్నికల్లో కూడా మెజారీటీ స్థానాలను గెలుపొందింది. 13 నెలలకే పతనమైంది. 1998 నుంచి 2004 మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అప్పుడే ప్రధానిగా వాజ్‌పేయి, ఉప ప్రధానిగా అద్వానీ తమ రాజకీయ చతురతతో దేశ ప్రగతిని పరుగులు పెట్టించారు.
వాజ్‌పేయ్ తరువాత అద్వానీ పార్టీ పగ్గాలను చేపట్టారు. పార్టీని ముందుకు తీసుకువెళ్లడంలో ఎంతో కీలకంగా కూడా వ్యవహరించారు. తరువాత పార్టీ పగ్గాలు ఎంత మంది చేతులు మారినా అధికారానికి మాత్రం చేరువ కాలేదు.