గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 నవంబరు 2019 (13:05 IST)

అయోధ్య తీర్పు.. జగన్ స్పందన.. పెదవి విరిచిన ఆ రెండు బోర్డులు?

అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించిన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ స్పందించారు. అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసిన మీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించిందని చెప్పారు.

ఇలాంటి పరిస్థితుల్లో మతసామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తి చేస్తున్నానని జగన్ పిలుపునిచ్చారు. ప్రజలందరు సంయమనం పాటించి శాంతిభద్రతలకు సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నానని జగన్ ట్వీట్ చేశారు.
 
అయితే అయోధ్యపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుపై ముస్లిం పర్సనల్‌ లా బోర్డు స్పందించింది. అయితే ఇందులో తమకు ఆమోదయోగ్యం కాని విషయాలు కూడా ఉన్నాయని పేర్కొంది. మరొక్కసారి దృష్టిసారించాల్సిందిగా సుప్రీంకు విన్నవిస్తామని తెలిపింది. న్యాయపరంగా ఎలా అడుగువేయాలో త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తమకు సంతృప్తికరంగా లేదన్నారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో చర్చించాల్సిన విషయాలు ఉన్నాయని, 15వ శతాబ్దానికి ముందు ఆధారాలు ఉన్నాయి అంటే.. 15వ శతాబ్దం తర్వాత కూడా ఆధారాలు ఉంటాయి కదా? అని ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ప్రశ్నించింది.
 
ఇంకా అయోధ్య కేసులో సుప్రీం తీర్పుపై సున్నీ వక్ఫ్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది షేక్ అహ్మద్ సయ్యద్ మాట్లాడుతూ.. తీర్పు సంతృప్తికరంగా లేదని.. అయినా గౌరవిస్తామన్నారు. తీర్పు కాపీని మరింత పరిశీలించాల్సి ఉందని.. ఆ తర్వాతే భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామన్నారు. అందరూ శాంతియుతంగా ఉండాలని.. ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని విజ్ఞప్తి చేశారు.
 
కాగా అయోధ్యలో ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలాన్ని ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. వివాదాస్పద భూభాగాన్ని అలహాబాద్ హైకోర్టు విభజించడం ఆమోదయోగ్యం కాదని సుప్రీం స్పష్టం చేసింది. మసీదు కూల్చివేత చట్టవిరుద్ధమని కూడా తన తీర్పులో సుప్రీం కోర్టు పేర్కొంది.