సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 9 నవంబరు 2019 (10:20 IST)

మరికొన్ని క్షణాల్లో అయోధ్య తీర్పు... సోమవారం వరకు విద్యా సంస్థలకు సెలవు

దశాబ్దాల తరబడి వివాదాస్పదంగా ఉన్న రామజన్మభూమి - అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించిందనుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా, అయోధ్య ప్రాంతం ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్థలకు సోమవారం సెలవులు ప్రకటించారు. 
 
తీర్పు నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పాఠశాలలు, కళాశాలలతోపాటు శిక్షణ సంస్థలకు సెలవులు ప్రకటించినట్టు ప్రభుత్వం పేర్కొంది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అవసరమైతే రక్షణ దళాలను తరలించేందుకు విమానాలను సిద్ధంగా ఉంచారు. పరిస్థితులను అదుపులో ఉంచేందుకు డివిజనల్ కమిషనర్లు, ఏడీజీపీ, ఐజీ స్థాయి అధికారులు క్షణక్షణం పర్యవేక్షిస్తున్నారు
 
మరోవైపు, దశాబ్దాల తరబడి దేశంలో అనేక సంఘటనలకు, తీవ్రస్థాయి రాజకీయ పరిణామాలకు కారణమైన అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు శనివారం తుది తీర్పు వెలువరించనుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పును ఇవ్వనున్నారు. 
 
ఈ నెల 17వ తేదీన రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేయనున్నారు. ఈయనకు ఈ నెల 15వ తేదీనే చివరి పనిదినం కావడంతో ఈలోపే అత్యంత ముఖ్యమైన అయోధ్య తీర్పు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకే మునుపెన్నడూ లేనంత వేగంగా కొన్నిరోజులుగా ఇరుపక్షాల వాదనలు వినడం పూర్తి చేసి అంతిమ తీర్పుకు కసరత్తులు చేశారు.
 
అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశంలోని సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. ఒక్క అయోధ్యలో భద్రత కోసమే 4,000 మంది పారామిలిటరీ సిబ్బందిని తరలించారు. ఇవాళ ఉదయం నుంచే యూపీ సర్కారు కదలికలు అయోధ్య తీర్పు వేగిరమే వస్తుందన్న అంచనాలను బలపరిచాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో యూపీ ఉన్నతాధికారులు ఆయన చాంబర్‌లోనే భేటీ అయ్యారు.