శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 8 నవంబరు 2019 (16:39 IST)

అయోధ్య: సుప్రీంకోర్టు తీర్పు వచ్చే ముందు ఇక్కడ మూడ్ ఎలా ఉంది? - గ్రౌండ్ రిపోర్ట్

రాముడి వనవాసం ముగిశాక పునరాగామన పర్వాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సంబరాల్లో మిఠాయిలు పంచుతూ వేడుక చేసుకుంటున్నారు రామ జన్మభూమి పూజారి సత్యేంద్ర దాస్. ఆయన పక్కనే ఉండి.. ఆయన దగ్గరున్న ప్లేటులోంచి స్వీట్లు తీసుకుంటున్నారు బాబ్రీ మసీదు తరఫు న్యాయవాది ఇక్బాల్ అన్సారీ. ఇద్దరూ కలిసి ఒకే పళ్లెంలో తినటమే కాదు.. సత్యేంద్ర దాస్ పండుగ కానుకగా అన్సారీకి రూ. 100 కూడా ఇచ్చారు.

 
వీళ్లద్దరూ పక్క పక్కనే కూర్చుని ముచ్చటించుకున్నారు. మీడియాను ఆహ్వానించటం గురించి చర్చించుకున్నారు. హిందూ, ముస్లింల మధ్య మత సామరస్యం గురించి మాట్లాడుకున్నారు. అయితే.. బాబ్రీ మసీదు ఒక 'నిర్మాణం' అని సత్యేంద్ర దాస్ అభివర్ణిస్తారు. దానికింద ఒక ఆలయ శకలాలు లభించాయని నమ్ముతారు. ''ఒకవేళ నిజంగా మసీదు ఉన్నట్లయితే సున్నీ వక్ఫ్ బోర్డు ఆ మసీదు తనకు చెందుతుందని 1961లో కోర్టులో ఎందుకు కేసు వేసింది?'' అని ఆయన ప్రశ్నిస్తారు.

 
సత్యేంద్ర దాస్ తన ఇంట్లో ఒక పీట మీద కూర్చుని బీబీసీతో మాట్లాడారు. ఆయన వెనకాల విల్లంబులు పట్టుకుని ఉన్న రాముడి చిత్రపటం ఉంది. ''రామ్ లల్లా 26 సంవత్సరాలకు పైగా ఒక కాటన్ రగ్గు మీద కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు ఒక అద్భుత ఆలయం నిర్మించే సమయం వచ్చినట్లు కనిపిస్తోంది'' అని పేర్కొన్నారు.

 
పాత వివాదంలో ఆర్ఎస్ఎస్
సంత్ కబీర్ నగర్‌కు చెందిన సత్యేంద్ర దాస్.. బాబ్రీ మసీదు విధ్వంసానికి కేవలం కొన్ని నెలల కిందే రామ జన్మభూమి పూజారిగా నియమితులయ్యారు. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్‌లను తీవ్రంగా విమర్శించే పాత పూజారి లాల్ దాస్‌ను తొలగించి ఆయన స్థానంలో సత్యేంద్ర దాస్‌ను నియమించారు. బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన సుమారు 11 నెలల తర్వాత లాల్ దాస్ హత్యకు గురయ్యారు.

 
హిందుత్వ మద్దతుదారులు రామ మందిరం ఉద్యమం మీద తమ పట్టును బలోపేతం చేసుకోవటానికి.. నిర్మోహి అఖాడా వంటి స్థానిక రామ మందిర ఉద్యమకారులను క్రమంగా పక్కకి నెడుతున్నారని చెప్తున్న సమయం అది. రామ మందిరం లేదా బాబ్రీ మసీదు అంశం మీద నిర్ణయం తీసుకోవాల్సింది సుప్రీంకోర్టే అయినప్పటికీ.. అయోధ్య మత పెద్దలు తమ విజయం తథ్యమని స్పష్టంగా పసిగడుతున్నారు. ఇక్కడ జరుగుతున్న చర్చల్లో మోదీ, యోగిల పేర్లు మాకు తరచుగా వినించాయి.

 
రాముడి విగ్రహం ప్రతిష్టించివున్న స్థలంలోనే ఒక గొప్ప రామ మందిరం నిర్మిస్తామని.. కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో యోగి ప్రభుత్వం ఉన్నపుడే ఈ ఆలయాన్ని నిర్మిస్తామని.. రామ జన్మభూమి న్యాస్ (శంకుస్థాపన)కు చెందిన నృత్య గోపాల్ దాస్ అంటున్నారు. ''తీర్పు కచ్చితంగా రామ మందిరానికి అనుకూలంగానే వస్తుంది'' అని రామ జన్మభూమి న్యాస్ (శంకుస్థాపన)కు చెందిన జనమేజయ శరణ్ చెప్తున్నారు.

 
రామ జన్మభూమి నిర్మాణ సంస్థ నుంచి రాముడి పేరుతో నెలకొల్పిన సంస్థల్లో ఏ ఒక్కటీ కోర్టు న్యాయ ప్రక్రియలో భాగస్వామిగా లేదు. కానీ.. నృత్య గోపాల్ దాస్‌ను ప్రభుత్వానికి సన్నిహితుడిగా భావిస్తున్నారు. తీర్పు ఆలయానికి అనుకూలంగా వస్తే.. మందిర నిర్మాణ బాధ్యతలు ఆయన సంస్థకు లభించవచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 
సోమ్‌నాథ్ ఆలయ బోర్డు తరహాలో ఒక బోర్డును నెలకొల్పాలన్న ఆలోచనకు కొంతమంది మద్దతిస్తున్నారు. అర్థ శతాబ్దానికి పైగా న్యాయ పోరాటాలు సాగించిన నిర్మోహి అఖాడా, హిందూ మహాసభ వంటి సంస్థలు.. రామ మందిరం మీద ఆర్ఎస్ఎస్ రాజకీయాల్లో భాగస్వాములు కాలేకపోయాయి. పర్యవసానంగా ఇప్పుడు అవి ఈ విషయంలో దూరంగా నామమాత్రంగా మిగిలాయి.

 
''నిర్మోహి అఖాడా ఎన్నడూ తన కృషి గురించి ప్రచారం చేయలేదు. కానీ వాళ్లు చేశారు. రాముడి పేరు మీద ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు'' - నిర్మోహి అఖాడా ఆవరణలోని ఒక అశోక వృక్షం కింద కూర్చున్న దినేంద్ర దాస్ పేర్కొన్నారు. అయితే.. భవిష్యత్ కార్యాచరణను హిందూ గ్రూపులన్నీ ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటాయని ఆయన ఉద్ఘాటిస్తున్నారు.

 
వర్క్‌షాప్ దగ్గర దృశ్యాలు
రామ మందిరం కోసం అవసరమైన వాటిని తయారుచేస్తున్న వర్క్‌షాప్‌ ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తోంది. సమీపంలోని ఆలయం నుంచి భక్తిగీతాలు లౌడ్ స్పీకర్లలో వినిపిస్తున్నాయి. చాలా మంది పర్యాటకులు కూడా అక్కడికి వస్తున్నారు. ఆ భక్తులకు టూరిస్ట్ గైడ్లు ఈ భవన సముదాయంలోని ప్రదర్శన శాలను చూపిస్తున్నారు. రామ మందిర ఉద్యమం సందర్భంగా చనిపోయిన కర సేవకుల గురించి ఆ ప్రదర్శన వివరిస్తోంది. చారిత్రక ఆధారాలు ఏవీ లేకున్నా కానీ.. రామ మందిరాన్ని కూల్చివేయటానికి బాబరు అనుమతి ఇస్తున్నట్లు చెప్పే చిత్రాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.

 
అయోధ్యలో టూరిస్ట్ గైడ్ల గురించి స్థానిక పాత్రికేయుడు మహేంద్ర త్రిపాఠిని అడిగినపుడు.. ఆయన నవ్వుతూ ''రాముడి పేరుతో చాలా మంది వ్యాపారం చేస్తున్నారు'' అని చెప్పారు. ''చివరి శిల్పి గత నెలలో చనిపోయాడు.. అప్పటి నుంచి పని ఆగిపోయింది'' అని చెప్పారు కరసేవక్ పురం దగ్గర సూపర్‌వైజర్‌గా వ్యవహరిస్తున్న అన్ను భాయ్ సోన్‌పురా.

 
ఒకప్పుడు దాదాపు 150 మంది శిల్పులు ఇక్కడ పనిచేస్తుండేవారు. ఈ ఆవరణలో శిల్పాలు చెక్కివున్న స్తంభాలు పడివున్నాయి. అవి నలుపు రంగులోకి మారుతున్నాయి. వాటిని ఉపయోగించటానికి ముందు బాగా పాలిష్ చేయాల్సి ఉంటుందని అన్ను భాయ్ సోన్‌పురా పేర్కొన్నారు. కరసేవక్ పురం బయట ఉన్న ఒక టీ కొట్టు, పాన్ షాపు యజమాని సంతోష్ చౌరాసియా. రామ మందిరం ఇంకా నిర్మించలేదని ఆమె చాలా కోపంగా ఉన్నారు.

 
''ఆ ఐదు లక్షల దీపాలు వెలిగించి ఉపయోగం ఏమిటి? జనం తాజ్ మహల్ చూడటానికి ఆగ్రా వెళతారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించి ఉన్నట్లయితే ఆ ఆలయాన్ని సందర్శించటానికి జనం ఇక్కడికి వస్తుండేవారు'' అని ఆమె పేర్కొన్నారు. ''వాళ్లు ఆలయాన్ని నిర్మించనివ్వకపోతే.. వాళ్లు కూడా తమ ఓట్ల ఆదాయం కోల్పోతారు'' అని కూడా ఆమె వ్యాఖ్యానించారు. అయోధ్య నగర శివార్లలో ఉంది కర సేవక్ పురం. నగరంలోని ఇతర ప్రాంతాల్లో మోహరించినట్లుగానే ఇక్కడ కూడా భద్రతా దళాలు మోహరించి ఉన్నాయి.

 
భద్రతా బలగాల మోహరింపులకు అయోధ్య వాసులు అలవాటు పడిపోయారు. వాళ్లు తమ దైనందిన కార్యకలాపాలు, జీవన పోరాటాల్లో నిమగ్నమైపోయారు. హనుమాన్ ఆలయ వీధిలోని మిఠాయి దుకాణాలు కొబ్బరి లడ్డూలు, కేసరియా పేడా, ఖుర్చాన్‌లు యథావిధిగా అమ్ముతున్నాయి. అక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

 
''అయోధ్యలో భిన్న మతాల మధ్య ఇప్పటికీ అదే సామరస్యం ఉంది. మీరు ఏదైనా అలజడులు చూస్తున్నారంటే అది కేవలం టీవీ చానళ్లలో మాత్రమే'' అంటారు ముజిబుర్ అహ్మద్. ఏం జరిగినా కానీ ఆలయ నిర్మాణం మాత్రం 2020 సాధారణ ఎన్నికల కన్నా ముందు మొదలు కాదని భావిస్తున్నారు రోహిత్ సింగ్. ''నిర్ణయం ముస్లింలకు అనుకూలంగా వస్తే హిందువులు ఒప్పుకుంటారని.. హిందువులకు అనుకూలంగా వస్తే ముస్లింలు ఒప్పుకుంటారని.. హామీ ఏముంది?'' అని అటికుర్ రెహ్మాన్ ప్రశ్నిస్తున్నారు.

 
కోర్టు తీర్పు న్యాయంగా ఉంటే ముస్లిం గ్రూపులు అంగీకరిస్తాయని బాబ్రీ మసీదు మద్దతుదారుడైన ఖాలిక్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. అలా లేకపోతే.. తర్వాత ఏం చేయాలనేది వారు ఆలోచిస్తారని.. అవసరమైతే ఆ తీర్పు మీద మళ్లీ కోర్టులో అప్పీలు చేస్తారని చెప్పారు. ఖాలిక్ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన మధ్యవర్తుల కమిటీని కలిశారు. బాబ్రీ మసీదు భూమి మీద తమ హక్కును వదులుకోవాలని ముస్లింల మీద ఒత్తిడి తెచ్చారని ఆయన అంటారు.

 
తాము చాలా హక్కులు ఉపసంహరించుకున్నామని.. కానీ 120 X 40 అడుగుల భూమి మీద హక్కును మాత్రం వదులుకోలేదని బాబ్రీ మసీదు గ్రూపులు చెప్తున్నాయి. ఎందుకంటే.. మసీదుకు సంబంధించిన వక్ఫ్ భూమిలో ఎటువంటి మార్పులైనా కానీ భారత వక్ఫ్ చట్టానికి వ్యతిరేకమని పేర్కొన్నాయి. ఈ కొంచెం జాగాను వదిలేసి మిగతా భూమి మీద ఆలయ నిర్మాణం మొదలుపెట్టినా అంగీకరించటానికి తాము సిద్ధంగా ఉన్నామని ఖాలిక్ చెప్తున్నారు.

 
''మసీదును మళ్లీ నిర్మించాలని కూడా మేం అడగటం లేదు. కానీ.. కొంతమందికి.. రామ మందిరం నిర్మించటం కన్నా కూడా.. దీనిని హిందూ - ముస్లిం సమస్యగా చూపాలన్న ఆసక్తే ఎక్కువగా ఉంది'' అంటారాయన.

 
అయోధ్యకు పది లక్షల మంది భక్తులు
కాగా, సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో అదనపు బలగాలను, 16 వేల మంది డిజిటల్ వలంటీర్లను నియమించామని అయోధ్య పోలీసు సూపరింటెండెంట్ ఆశిష్ తివారీ చెప్పారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ వెల్లడించింది. సోషల్ మీడియాలో కూడా ఎలాంటి పుకార్లు ప్రచారం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు. జిల్లాలో బాణసంచా, డ్రోన్ల వినియోగాన్ని రద్దు చేశారు. ముందస్తు అనుమతితోనే వీటిని వినియోగించాలని వెల్లడించారు.

 
వచ్చేవారం సరయూ నదిలో స్నానమాచరించేందుకు అయోధ్యకు దాదాపు పది లక్షల మంది భక్తులు రానున్నారు. ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ శుక్రవారం ఢిల్లీలో భేటీ కానున్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.