సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 నవంబరు 2019 (15:23 IST)

1992 ఘర్షణలు పునరావృతం కారాదు : శరద్ పవార్

వివాదాస్పద అయోధ్య కేసులో సుప్రీంకోర్టు త్వరలో తుది తీర్పును వెలువరించనుంది. ఈ తీర్పు కోసం దేశం యావత్తూ ఆసక్తితో ఎదురు చూస్తోంది. దీనిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందిస్తూ, సుప్రీంకోర్టు తీర్పు కోసం తాను ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. 
 
తీర్పు ఎలా ఉన్నా.. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కోర్టు తీర్పును స్వాగతిస్తామని, దానిని బట్టి రామ మందిర నిర్మాణానికి సహకరిస్తామని చెప్పిన బాబ్రీ మసీద్‌ యాక్షన్‌ కమిటీని పవార్‌ అభినందించారు. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉన్నా సంయమనం కోల్పోవద్దని, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతర పరిస్థితులు (మత ఘర్షణలు) పునరావృతం కావొద్దని ఆయన కోరారు. 
 
మరోవైపు, అయోధ్య వివాదంపై త్వరలో తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ముంబై మహానగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం ముంబైలో మత ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో ముందు జాగ్రత్తగా కేంద్రం భారీ సంఖ్యలో బలగాలను మొహరించింది. సున్నితమైన ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.