మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 ఆగస్టు 2021 (17:08 IST)

అశ్వానికి కాషాయం రంగు : బీజేపీపై మేనకా గాంధీ సంస్థ ఫిర్యాదు

భారతీయ జనతా పార్టీ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం జన్ ఆశీర్వాద్ పేరుతో దేశ వ్యాప్త యాత్రలకు శ్రీకారం చుట్టనుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత ఈ యాత్ర ప్రారంభంకానుంది. 
 
ముఖ్యంగా, ప్రధాని నరేంద్ర మోడీ కొత్తగా చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవులు దక్కించుకున్నవారు, ప్రమోషన్లు పొందినవారు ఈ యాత్ర ద్వారా ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
కాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా ఓ గుర్రానికి బీజేపీ జెండా రంగులు వేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా నిర్వహించిన ఈ యాత్రలో గుర్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
 
అయితే, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీకి చెందిన పీపుల్ ఫర్ యానిమల్స్ (పీఎఫ్ఏ) స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. 
 
ఇది ఖచ్చితంగా జంతువులను హింసించడం కిందికే వస్తుందని భావిస్తూ వారు ఇండోర్‌లోని సంయోగితా గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లాలని వారు నిర్ణయించారు. 
 
కాగా, గతంలో మేనకా గాంధీ ప్రధాని మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం-1 మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పని చేసిన విషయం తెల్సిందే. ఆమె కుమారుడు వరుణ్ గాంధీ బీజేపీలో కొనసాగుతున్నారు.