1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 12 ఏప్రియల్ 2023 (17:28 IST)

జాతరలో అగ్నిగుండ ప్రవేశం చేసిన బీజేపీ నేత

sambita patra
ఒరిస్సా రాష్ట్రంలోని పూరి జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన జాతరలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామదేవత దులన్‌ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జాతరలో భాగంగా పది మీటర్ల వరకు ఏర్పాటు చేసిన అగ్నిగుండంపై నడిచారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ప్రజల శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
 
'పూరీ జిల్లాలోని రెబాటి రామన్ గ్రామంలో జరిగిన ఝాము జాతరలో పాల్గొన్నాను. నిప్పులపై నడిచి అమ్మవారిని పూజించాను. ప్రజలు సుఖసంతోషాలతో తులతూగాలని వారి శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రార్థించాను. అగ్నిగుండంపై నడిచి అమ్మవారి దీవెనలు పొందడం వల్ల పుణ్యం పొందాను' అని ఆయన ట్వీట్‌ చేశారు. 
 
ఝాము జాతరలో కోరికలు నెరవేరాలని అమ్మవారు దులన్‌ను ప్రసన్నం చేసుకోవడానికి  భక్తులు నిప్పుల మీద  నడవడం ఇక్కడి సంప్రదాయం. ఒడిశాకు చెందిన సంబిత్‌ పాత్రా 2010లో భారతీయ జనతా పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పాత్రా చురుకుగా పాల్గొనడంతో పార్టీ ఆయన్ను భాజపా జాతీయ అధికార ప్రతినిధిగా నియమించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పూరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ, బిజూ జనతా దళ్‌ అభ్యర్థి పినాకి మిశ్రాతో తలపడి ఓడిపోయారు. ప్రస్తుతం ఇండియన్‌ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.