శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2017 (17:10 IST)

దేవభూమిలో కాషాయం రెపరెపలు .. చిత్తుగా ఓడిన బీజేపీ సీఎం అభ్యర్థి

దేవభూమిగా కీర్తిగాంచిన హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయం రెపరెపలాడింది. సోమవారం వెల్లడైన ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయాన్ని నమోదు చేసింది.

దేవభూమిగా కీర్తిగాంచిన హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయం రెపరెపలాడింది. సోమవారం వెల్లడైన ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయాన్ని నమోదు చేసింది. 68 స్థానాలు కలిగిన ఆ రాష్ట్రంలో కాషాయ పార్టీ మ్యూజిక్ ఫిగర్‌ను క్రాస్ చేసింది. బీజేపీకి 44 సీట్లు దక్కగా.. కాంగ్రెస్‌కు 21 సీట్లు వచ్చాయి. 
 
ఈ రాష్ట్రంలో గత రెండు దశాబ్దాలుగా అధికారం ఇరు పార్టీల మధ్య దోబూచులాడుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే, ఇపుడు బీజేపీ విజయభేరీ మోగించింది. అయితే ఈ సారి సీపీఎం కూడా ఓ సీటును సొంతం చేసుకున్నది. నవంబర్ 9వ తేదీన హిమాచల్‌లో ఓటింగ్ జరుగగా, 40 రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు సోమవారం చేపట్టారు. 
 
అయితే బీజేపీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. బీజేపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసిన ప్రేమ్ కుమార్ ధుమాల్ ఓడిపోయారు. దీంతో ఆ పార్టీ సీఎం పదవి కోసం కొత్త వ్యక్తిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. 68 స్థానాల కోసం సుమారు 377 మంది పోటీపడ్డారు. అగ్ర పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు అన్ని స్థానాలకు పోటీ చేశాయి. బీఎస్పీ కూడా 42 స్థానాల నుంచి పోటీ చేసింది. ఈ రాష్ట్రంలో 75.28 శాతం ఓటింగ్ నమోదైంది. 
 
తన ఓటమిపై ప్రేమ్ కుమార్ ధుమాల్ స్పందిస్తూ, వ్యక్తిగత ఓటమి పెద్ద ప్రాధాన్యత కాదన్నారు. కానీ, రాష్ట్ర ఓటర్లు బీజేపీ అధికారం కట్టబెట్టారనీ, అందువల్ల వారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. అయితే, రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు. అదేసమయంలో తన ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తానని ఆయన వ్యాఖ్యానించారు.