1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 21 ఆగస్టు 2014 (11:17 IST)

2016లో ఎన్నికలు : తమిళనాడు సీఎం అభ్యర్థిగా రజనీకాంత్.. బీజేపీ గాలం!

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి 2016లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించేందుకు కమలనాథులు తమ వంతు ప్రయత్నాలు చాప కింద నీరులా మొదలు పెట్టారు. ఇందుకోసం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలు పావులు కదుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంపై పలువురు అగ్రనేతలు రజనీకాంత్‌కు ఫోన్ చేసి మంతనాలు జరిపినట్టు సమాచారం. 
 
ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చెన్నైలో రజనీకాంత్‌ను ఆయన నివాసంలో కలిసి మాట్లాడిన విషయం తెలిసిందే. ఇటీవల బీజేపీ సీనియర్ నేత ఒకరు కూడా ఆయనను కలిసి చర్చలు జరిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనను బీజేపీలోకి తీసుకుని వచ్చే బాధ్యతను అమిత్ షాకు మోడీ అప్పగించినట్లు చెబుతున్నారు. 2016 శాసనసభ ఎన్నికల్లో తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మోడీ వ్యూహరచన చేశారని, రజనీకాంత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల సమరంలోకి దిగాలని మోడీ భావిస్తున్నారని అంటున్నారు. 
 
మరోవైపు... తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అనేక విభిన్నమైన పథకాలను ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రజల మన్ననలు, అభినందలు పొందుతున్నారు. అలాంటి జయలలితను ఢీకొట్టేందుకు రజనీకాంత్ వంటి ఛరిష్మా కలిగిన నేత కావాలని బీజేపీ భావిస్తోంది. ఇందులోభాగంగానే రజనీకాంత్‌కు గాలం వేస్తున్నారు.