గురువారం, 18 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 సెప్టెంబరు 2025 (10:08 IST)

కర్ణాటక బస్సులో మంటలు.. 60మంది ప్రయాణీకులు.. రక్షించింది ఎవరంటే?

Bus fire
Bus fire
బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ)కి చెందిన బస్సు నిప్పంటుకుంది. బీఎంటీసీకి చెందిన బస్సులో సోమవారం ఉదయం 5.10 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగడంతో, బస్సు డ్రైవర్ జయచంద్ర, కండక్టర్ చౌడప్ప రెండు నిమిషాల కంటే తక్కువ సమయంలో స్పందించారు. 
 
బస్సులోని 60 మంది ప్రయాణీకులను బస్సు నుంచి సురక్షితంగా కాపాడారు. అయితే, బస్సు పూర్తిగా కాలిపోవడానికి కారణం ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక అగ్ని ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి బీఎంటీసీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ సాంకేతిక బృందం విచారణ ప్రారంభించింది. 
 
డిపో-51కి చెందినబీఎంటీసీ బస్సు HAL బస్ స్టాప్ వద్దకు చేరుకునేసరికి, ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. బస్సు కండక్టర్ చౌడప్ప, డ్రైవర్ వెంటనే స్పందించి.. మండిపోతున్న బస్సు నుండి ప్రయాణికులందరినీ సురక్షితంగా తరలించారు. తరలించబడిన ప్రయాణికులను మరొక బస్సు ద్వారా పంపించారు. 
 
జయచంద్ర, చౌడప్ప బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా తరలించే పనిలో ఉండగా, కర్ణాటక అగ్నిమాపక దళం మంటలను ఆర్పింది. అయితే, అప్పటికి బస్సు పూర్తిగా కాలిపోయింది. దీనిపై బీఎంటీసీ స్పందించింది. ప్రయాణీకుల భద్రత అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన అన్ని సాంకేతిక చర్యలు వెంటనే తీసుకుంటామని హామీ ఇచ్చింది.