బ్యాటరీని నాలుకతో తాకిన బాలుడు.. ఏమైందంటే..?
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ బాలుడు తన ఫోన్ బ్యాటరీని నాలుకతో తాకాడు. అంతే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. మీర్జాపూర్ జిల్లా మత్వార్ గ్రామానికి చెందిన 12 ఏళ్ల మోనూ 6వ తరగతి చదువుతున్నాడు.
శుక్రవారం (మార్చి 26,2021) ఉదయం మొబైల్ ఫోన్ బ్యాటరీని 'జుగాడ్ చార్జర్'లో ఉంచి చార్జింగ్ చేశాడు. గంట తర్వాత బ్యాటరీ చార్జింగ్ అయ్యిందా లేదా అవేది పరీక్షించేందుకు నాలుకతో టచ్ చేశాడు. అంతే.. పెద్ద శబ్దం చేస్తూ బ్యాటరీ అతడి ముఖంపైనే పేలిపోయింది.
శబ్దం విన్న కుటుంబసభ్యులు గదిలోకి వచ్చి చూడగా ముఖానికి తీవ్రగాయాలతో రక్తం మడుగులో మోను పడి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆ బాలుడు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియనీయకుండా గుట్టుగా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.