బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 23 జులై 2024 (09:03 IST)

నేడు కేంద్ర బడ్జెట్ : 8 నెలల కాలానికి మాత్రమే సమర్పించనున్న విత్తమంత్రి!

budget
2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలలకు మాత్రమే ఆమె ఈ బడ్జెట్‌ను సభకు సమర్పిస్తారు. మరోవైపు, అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాకారం దిశగా ఈ బడ్జెట్‌ను కేంద్ర రూపకల్పన చేసింది. అలాగే, ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి సమర్పిస్తున్న బడ్జెట్ ఇది.
 
ఈ బడ్జెట్‌లో నిత్యావసరాలు సహా అన్నింటి ధరలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యతరగతి ప్రజలు పన్ను ఉపశమనాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని 3.0 ప్రభుత్వం పూర్తిస్థాయి పద్దును మంగళవారం సమర్పించనుంది. 
 
అభివృద్ధి, సంక్షేమాల మధ్య ప్రభుత్వం సమతూకం పాటించాలని, వృద్ధికి ఊతమివ్వడంతో పాటు ద్రవ్యోల్బణం నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రంగాలకు ప్రాధాన్యతల మేరకు నిధులు కేటాయించే అవకాశం ఉంది.
 
మరోవైపు కేంద్ర ద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై పార్లమెంట్ ఉభయ సభల్లో 20 గంటల చొప్పున చర్చ జరిగే అవకాశం ఉంది. దిగువసభలో రైల్వేలు, విద్య, ఆరోగ్యం, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తదితర అంశాలను ప్రత్యేకంగా చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వివిధ పార్టీల ఎంపీలతో కూడిన సభా వ్యవహారాల కమిటీ సోమవారం భేటీ అయి ఈ మేరకు ఎజెండాను ఖరారు చేసింది.