మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 జనవరి 2022 (11:06 IST)

పార్లమెంట్ సమావేశాలపై కేంద్రం కీలక నిర్ణయం - వేర్వేరు సమయాల్లో...

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరోవైపు కొత్త ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు పార్లమెంట్ సమావేశం కావాల్సివుంది. ఇందుకోసం పార్లమెంట్ సమావేశంకానుంది. అయితే, ఈ సమావేశాల నిర్వహణపై కేంద్రం కీలక నిర్ణయంతో మార్పు కూడా చేసింది. 
 
పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలను వేర్వేరుగా నిర్వహించాలని నిర్ణయించింది. అంటే ఉదయం వేళ రాజ్యసభ, సాయంత్రం వేళ లోక్‌సభను నిర్వహించనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాజ్యసభను, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం వార్తా ప్రకటనను విడుదల చేసింది. 
 
కాగా, ఫిబ్రవరి ఒకటో తేదీన 2022-23 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సివుంది. ఇందుకోసం లోక్‌సభ ఉదయం 11 గంటలకు సమావేశమవుతుందని, 2వ తేదీ నుంచి మాత్రం సాయంత్రం 4 గంటలకు జరుగుతుందని తెలిపింది. అయితే, రాజ్యసభ మార్పు సమయాలపై రాజ్యసభ సచివాలయం అధికారిక ప్రకటన చేయాల్సివుంది. ఎందుకంటే.. రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా వైరస్ సోకడంతో ఆయన హైదరాబాద్ నగరంలోనే ఉండిపోయారు. దీంతో రాజ్యసభ సమయంపై అధికారిక ప్రకటన వెల్లడికాలేదు.