లైంగిక వేధింపుల కేసు : రంజన్ గగోయ్‌కు క్లీన్ చిట్
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్‌కు క్లీన్ చిట్ లభించింది. తన కార్యాలయంలో పని చేసిన ఓ మహిళ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ఆయనకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇస్తూ, ఆయనకు వ్యతిరేకంగా కుట్ర జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది.
నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్‌సీ) సహా జస్టిస్ గొగొయ్ తీసుకున్న నిర్ణయాలకు ఈ కుట్ర కోణాన్ని ఆపాదించవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. గొగొయ్‌పై వచ్చిన ఆరోపణల్లో కుట్రకోణం ఏదైనా ఉందా అని తెలుసుకోవడానికి నియమించిన జస్టిస్ ఏకే పట్నాయక్ కమిటీ ఇచ్చిన రిపోర్టు మేరకు సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా, జస్టిస్ గొగోయ్ కేసులో కుట్ర కోణం దాగి ఉన్నదని ఏకే పట్నాయక్ రిపోర్టు స్పష్టం చేసినట్లు సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించింది. దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను మాత్రం ప్యానెల్ సంపాదించలేకపోయిందని చెప్పింది.
ఎన్ఆర్‌సీలాంటి కేసుల్లో జస్టిస్ గొగొయ్ తీసుకున్న నిర్ణయాలపై చాలా మంది అసంతృప్తిగా ఉన్నారని ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా సుప్రీం గుర్తు చేసింది. అందువల్ల తాము ఈ కేసును మూసివేస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది. ఈ కమిటీ గొగొయ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపడానికి కాదని కూడా కోర్టు ఈ సందర్భంగా చెప్పింది.