సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ ఎవరు? ఎన్వీ రమణకు ఛాన్స్ దక్కదా?
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపిక కమిటి (కొలీజియం)లో విభేదాలు పొడచూపినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి ఎవరన్నదానిపై సందిగ్ధత నెలకొంది. పైగా, ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే కూడా తన వారసుడి విషయంలో మౌనంగా ఉంటున్నారు. దీంతో దేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎవరన్నదానిపై చర్చ సాగుతోంది.
వాస్తవానికి ప్రధాన న్యాయమూర్తే తన తదుపరి వారసుడుని ఎంపిక చేయడం ఆనవాయితీగా ఉంది. కానీ, ఈ దఫా అలా జరిగేలా కనిపించడం లేదు. ఇప్పటివరకు కొత్త సీజేఐ ఎవరన్నదానిపై సందిగ్ధం కొనసాగుతున్నది. ప్రస్తుత సీజేఐ ఎస్‌ఏ బోబ్డే ఏప్రిల్ 23న పదవీ విరమణ చేయనున్నారు. ఇలా జరగడం గత ఐదేళ్ళలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
పైగా, సీజేఐ ఎవరు కావాలన్న అంశంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపిక కమిటీ (కొలీజియం) ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. కొలీజియంలో సీజేఐతోపాటు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, రోహింగ్టన్ నారీమన్, యూయూ లలిత్, ఏఎం ఖాన్విల్కర్ ఉన్నారు. కొలీజియంలో ఏకాభిప్రాయం లేకపోవటంతో తదుపరి సీజేఐ ఎంపిక ముందుకు సాగటం లేదు.
మరోవైపు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ జాబితాను పరిశీలిస్తే, ఇందులో జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్ నాగేశ్వర్‌రావు, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ మోహన్ శంతనగౌడార్ పేర్లు ఉన్నాయి.