శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (10:51 IST)

తీహార్ జైలుకు చిదంబరం... తనయుడికి కేటాయించిన గదిలోనే తొలిరాత్రి

కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరంను తీహార్ జైలుకు తరలించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆయన మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్, సీబీఐ అధికారులు అభియోగాలు మోపిన విషయం తెల్సిందే. ఈకేసులో ఈడీ విచారణ ముగిసిన తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టడగా ఆయనకు ఈ నెల 17వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీని మేజిస్ట్రేట్ విధించారు. 
 
దీంతో చిదంబరంను అత్యంత భద్రత కలిగిన ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. అక్కడ ఆయనకు గతంలో ఆయన కుమారుడు కార్తి చిదంబరం కేటాయించిన గదినే ఇపుడు కేటాయించడం గమనార్హం. ఈ గదిలోనే చిదంబరం తొలిరాత్రి కనుకుతీశారు. 
 
గత యేడాది ఇదే కేసులో చిదంబరం కుమారుడు కార్తి చిదంబరంను సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత తీహార్ జైలులో 12 రోజుల పాటు ఉన్నాడు. అపుడు ఆయనకు 7వ నంబరు గదిని కేటాయించారు. ఇపుడు అదే గదిని చిదంబరంకు అధికారులు కేటాయించారు. 
 
సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో భాగంగా అరెస్టయిన తర్వాత, బెయిల్‌ను నిరాకరిస్తూ, కోర్టు రిమాండ్‌ను విధించడంతో నిన్న రాత్రి ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. అందులోని 7వ నంబర్ గదిని చిదంబరానికి కేటాయించారు.
 
కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు ప్రత్యేక గదిని కేటాయించామని, వెస్ట్రన్ టాయిలెట్ అందులో ఉందని, ఆయన లైబ్రరీని వాడుకోవచ్చని, టీవీ చూడవచ్చని కూడా జైలు అధికారులు తెలిపారు. 
 
కాగా, తొలిరాత్రి చిదంబరంకు భోజనంలో అన్నం, పప్పు, రోటి, కూర ఇచ్చారు. ఉదయం 7 నుంచి 8 మధ్య అల్పాహారం ఇస్తామని చెప్పారు. జైల్లో ఉన్న మంచి నీటి ప్లాంట్ నుంచి శుద్ధి చేయబడిన నీటిని ఆయన తాగవచ్చని, లేకుంటే క్యాంటీన్‌లో కొనుగోలు చేసి సేవించవచ్చని తెలిపారు.