శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (17:27 IST)

నా సోదరుడు స్టాలిన్‌ను కలిసేందుకు చెన్నై వచ్చా : సీఎం కేసీఆర్

తన సోదరుడు ఎంకే స్టాలిన్‌ను కలిసేందుకు చెన్నపట్టణం వచ్చినట్టు సీఎం కేసీఆర్ తన చెన్నై పర్యటనపై వ్యాఖ్యానించారు. దేశంలో గుణాత్మక రాజకీయ మార్పుకోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును ప్రతిపాది

తన సోదరుడు ఎంకే స్టాలిన్‌ను కలిసేందుకు చెన్నపట్టణం వచ్చినట్టు సీఎం కేసీఆర్ తన చెన్నై పర్యటనపై వ్యాఖ్యానించారు. దేశంలో గుణాత్మక రాజకీయ మార్పుకోసం కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటును ప్రతిపాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ విషయంలో తన ప్రయత్నాల్లో వేగం పెంచారు. ఫెడరల్ ఫ్రంట్‌లో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిథ్యం ఉండాలని భావిస్తున్న సీఎం.. దేశహితం కోసం కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీలతో, నాయకులతో చర్చలను ముమ్మరం చేస్తున్నారు.
 
ఇందులోభాగంగా, ఆయన ఆదివారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి చెన్నైకు వచ్చారు. అనంతరం ఆయన డీఎంకే అధినేత కరుణానిధితోనూ, ఆయన తనయుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌తో సమావేశమయ్యారు. అలాగే, రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి ఆశీర్వాదం కూడా తీసుకున్నామని తెలిపారు. ఆ తర్వాత స్టాలిన్‌తో కలిసి మధ్యాహ్న విందు ఆరగించారు. 
 
అనంతరం కేసీఆర్ మీడియాతో స్పందిస్తూ, ఈ రోజు నేను నా బ్రదర్‌ స్టాలిన్‌ను కలవడానికి వచ్చాను. ఏడు దశాబ్దాలుగా కొనసాగుతోన్న కేంద్ర, రాష్ట్ర సంబంధాలు సహా చాలా అంశాలపై చర్చించాను అని వ్యాఖ్యానించారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని, రాజకీయాల్లో మార్పు అవశ్యకతపై ఇటీవల మమతా బెనర్జీతోనూ చర్చించానని కేసీఆర్ అన్నారు. విద్య, వైద్యం, తాగునీరు, పట్టణ, గ్రామీణ అభివృద్ధి వంటి అనేక సమస్యలను కేంద్ర ప్రభుత్వాలు పరిష్కరించలేకపోయాయని, వీటన్నింటిపై తాము చర్చించామని తెలిపారు.