1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 నవంబరు 2021 (15:44 IST)

పేట్రేగిపోయిన ఉగ్రవాదులు.. పలువురు జవాన్లు మృతి

మణిపూర్‌‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. 46 అసోం రైఫిల్స్ జవాన్లు వెళ్తున్న కాన్వాయ్‌పై మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో కమాండింగ్ ఆఫీసర్‌, ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురు జవాన్లు మరణించారు. 
 
చూరచాంద్‌పూర్ జిల్లా బెహియాంగ్ పరిధిలోని సెకెన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. కమాండింగ్ ఆఫీసర్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడితో పాటు క్విక్ రియాక్షన్ టీమ్ వాహనాల్లో వెళ్తుండగా ఉగ్రవాదులు దాడి చేశారు.
 
జవాన్లు తేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విప్లవ్ త్రిపాఠితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, నలుగురు జవాన్లు స్పాట్‌లోనే మరణించినట్లు తెలిసింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
 
సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడ్డ జవాన్లను హుటాహుటిన ఆస్పత్రికి తరలించాయి. సెకెన్ గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 
 
జవాన్లపై దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఐతే ఈ దాడికి ఎవరు పాల్పడ్డారన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఇప్పటి వరకు ప్రకటన విడుదల చేయలేదు.