గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (14:17 IST)

ఉత్పత్తులకు సంబంధించి ఇచ్చే యాడ్‌ల సైజులోనే క్షమాపణల ప్రకటన ఇచ్చారా? సుప్రీంకోర్టు

ramdev baba
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెపుతూ ఇచ్చిన ప్రకటనలు మీరిచ్చే వాణిజ్య ప్రకటనల సైజులోనే ఉన్నాయా అని సూటిగా ప్రశ్నించారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో బహిరంగ క్షమాపణలు చెబుతూ దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని రాందేవ్‌ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద మంగళవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. దీనిపై ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ఉత్పత్తులకు సంబంధించి ఇచ్చే యాడ్‌ల సైజులోనే క్షమాపణల ప్రకటన ఇచ్చారా? మరి ముందే ఎందుకు ప్రచురించలేదు? అంటూ ప్రశ్నలు సంధించింది. 
 
పతంజలి కేసు విచారణ సందర్భంగా ఆ కంపెనీ తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ మంగళవారం వాదనలు వినిపించారు. 67 పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని, అందుకోసం కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసినట్లు కోర్టుకు వెల్లడించారు. దీనిపై జస్టిస్‌ హిమా కోహ్లీ స్పందిస్తూ.. 'క్షమాపణలను ప్రముఖంగా ప్రచురించారా? గతంలో ఉత్పత్తుల యాడ్‌లలో ఉపయోగించిన ఫాంట్‌నే వాడారా? అదే సైజ్‌లో క్షమాపణలను పబ్లిష్‌ చేశారా?' అని ప్రశ్నించారు. 
 
అలాగే రూ.లక్షలు ఖర్చు చేశామన్న రోహత్గీ వాదనపై స్పందిస్తూ.. 'తమకు సంబంధం లేదు' అని న్యాయమూర్తి అన్నారు. ఈ నేపథ్యంలో క్షమాపణలు చెబుతూ పెద్ద పరిమాణంలో మరోసారి అదనపు ప్రకటనలు ప్రచురిస్తామని రోహత్గీ కోర్టుకు తెలిపారు. దీంతో విచారణను ధర్మాసనం ఏప్రిల్‌ 30కి వాయిదా వేసింది. కోర్టు ధిక్కార అంశాన్ని సైతం అప్పుడే విచారిస్తామని పేర్కొంది. పత్రికల్లో వచ్చిన క్షమాపణల ప్రకటనలను రెండు రోజుల్లోగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. 
 
ఆధునిక వైద్యవిధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలిపై ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌, సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గతేడాది నవంబరులో ఆ సంస్థను మందలించింది. దీంతో ఎలాంటి ఉల్లంఘనలూ జరగవంటూ అప్పట్లో సంస్థ తరఫున న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ, వాటిని ఉల్లంఘించడంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
దీనిపై ఇప్పటికే రామ్‌దేవ్‌ బాబా, బాలకృష్ణ పలుమార్లు కోర్టుకు బేషరతు క్షమాపణలు చెప్పారు. కోర్టుకు వాటిని అంగీకరించకపోగా.. చర్యలకు సిద్ధంగా ఉండాలని తెలిపింది. అలాగే బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే పత్రికల్లో ప్రకటనల ద్వారా పతంజలి క్షమాపణలు ప్రచురించింది.