శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 28 జనవరి 2024 (13:40 IST)

బాల రాముడి విగ్రహ తయారీ కృష్ణ శిల కోసం భార్య తాళిని తాకట్టుపెట్టిన కాంట్రాక్టర్!!

lord rama
అయోధ్యలో ప్రాణ ప్రతిష్టుడైన బాల రాముడి విగ్రహం కోసం ఉయోగించిన కృష్ణ శిల ఓ కాంట్రాక్టరుకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ శిలను కర్నాటక రాష్ట్రంలోని ఓ రైతు పొలం నుంచి వెలికి తీశారు. అయితే, ఈ శిలను వెలికితీయడం వల్ల తాను కష్టాలపాలయ్యానని కాంట్రాక్టర్ వాపోతున్నాడు. వెలికితీతకు సంబంధించి కొంత లాభం వచ్చినా.. అధికారులు తనకు భారీ మొత్తంలో ఫైన్ వేశారని తెలిపాడు. 
 
ఈ కృష్ణ శిలను మైసూరు జిల్లా హెచ్.డి.కోట తాలూకా బుజ్జీగౌడనపురలోని పొలంలో ఈ శిలను గుర్తించారు. దీనిని వెలికి తీసేందుకు శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ ఆ పొలం యజమానితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కూలీలను పెట్టి శిలను బయటకు తీయించాడు. ఈ డీల్‌లో ఖర్చులన్నీ పోనూ తనకు రూ.25 వేల వరకు గిట్టుబాటు అయిందని శ్రీనివాస్ చెప్పాడు. అయితే, శిలను బయటకు తీసేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని, ఇందుకు రూ.80 వేలు జరిమానా కట్టాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. 
 
రాష్ట్ర, గనుల భూగర్భ శాఖ అధికారులు జారీ చేసిన ఈ నోటీసులను చూసి ఆందోళనకు గురైనట్లు శ్రీనివాస్ చెప్పాడు. వెంటనే అధికారులను వెళ్లి కలవగా.. జరిమానా వెంటనే కట్టకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని వారు హెచ్చరించని తెలిపారు. దీంతో తన భార్య తాళిని తాకట్టు పెట్టి, సొమ్ము తీసుకెళ్లి జరిమానా చెల్లించినట్లు శ్రీనివాస్ వివరించాడు.
 
అప్పటికి తనకు వివాహం జరిగి కేవలం ఎనిమిది నెలలు మాత్రమే అయిందని శ్రీనివాస్ చెప్పాడు. భవిష్యత్తులో ఆ శిలను రాముడి విగ్రహం కోసం ఉపయోగిస్తారని అప్పట్లో తమకు తెలియదన్నాడు. వెలికి తీసిన ఆ శిల అరుణ్ యోగిరాజ్ చేతిలో పడడం, బాలక్ రామ్ విగ్రహంగా మారి అయోధ్య రామ మందిరానికి చేరడం, కోట్లాది మంది భక్తుల పూజలు అందుకోవడం.. అంతా మాయలా ఉందని శ్రీనివాస్ చెప్పాడు.