మురికితో కూడిన బటన్లు లేని చొక్కా వేసుకున్నాడనీ... మెట్రో రైల్ ఎక్కేందుకు అనుమతించలేదు!!!
మురికితో కూడిన బటన్లు లేని చొక్కా వేసుకున్నాడనీ ఓ యువకుడిని మెట్రో రైల్ ఎక్కేందుకు అధికారులు అనుమతించలేదు. ఈ ఘటన బెంగుళూరులోని దొడ్డకళ్ళసంద్ర మెట్రో స్టేషన్‌లో మంగళవారం చోటు చేసుకుంది. షర్టు బటన్ వేసుకుని శుభ్రమైన దుస్తులతో రావాలని, లేకుంటే స్టేషన్‌లోకి వెళ్లనివ్వబోమని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(బీఎంఆర్‌సీఎల్) సిబ్బంది యువకుడిని కోరినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ ప్రయాణికుడు బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్యకు ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. 'మన మెట్రో ఇలా ఎప్పుడు మారింది?' అంటూ వ్యాఖ్యను జత చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
కాగా తాము ప్రయాణికులందరినీ సమానంగా చూస్తామని బీఎంఆర్‌సీఎల్ సిబ్బంది తెలిపారు. 'ప్రయాణికులు ధనవంతులా, పేదవారా, పురుషులా, మహిళలా అనే భేదం చూపం. ఆ యువకుడు తాగిన మత్తులో ఉన్నాడని అధికారులు అనుమానించారు. మెట్రోలో మహిళలు, పిల్లలు ప్రయాణిస్తుంటారు. వారి భద్రత మా బాధ్యత. అందుకే వారికి ఇబ్బంది కలగకూడదని అతడిని ఆపాము. కౌన్సిలింగ్ ఇచ్చాక మెట్రోలోకి అనుమతించాం' అని ఓ అధికారి తెలిపారు.
గతంలో కూడా ఇలాగే బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేషన్ ఒక రైతును దుస్తులు మురికిగా ఉన్నాయని మెట్రోలోకి అనుమతించలేదు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవడంతో సామాజిక మాధ్యమాల వేదికగా నెటిజన్లు బీఎంఆర్సీఎల్ సిబ్బందిపై నిరసన వ్యక్తంచేశారు. దీంతో అధికారులు మెట్రో సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు.