సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2024 (16:05 IST)

పవన్ కళ్యాణ్ మగాడైతే డైరెక్టుగా తిట్టాలి : ముద్రగడ పద్మనాభం

mudragada padmanabham
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిజంగా మగాడైతే తనను డైరెక్టుగా తిట్టాలని, సినీ పెయిడ్ ఆర్టిస్టులతో తిట్టించడం కాదని వైకాపా నేత ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు. తనను సినీ క్యారెక్టర్ ఆర్టిస్టులతో తిట్టిస్తున్నారని ముద్రగడ మండిపడ్డారు. పవన్ మగాడైతే ప్రెస్మీట్ పెట్టి నేరుగా తిట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వేసే ప్రతి ప్రశ్నకు తాను బహిరంగంగానే సమాధానం చెబుతానని ముద్రగడ పేర్కొన్నారు. 
 
ముద్రగడ విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్‌ను ఉద్దేశించి పవన్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను ఏదైనా మాట్లాడితే సినిమాల్లో ఉండే క్యారెక్టర్ ఆర్టిస్టులతో తిట్టిస్తున్నారని దుయ్యబట్టారు. తెరచాటుగా తనను తిట్టించడం కాదని, ప్రెస్మీట్  పెట్టి తన గురించి సూటిగా మాట్లాడాలని అన్నారు. పవన్ సంధించే ప్రతి ప్రశ్నకు తాను సమాధానాలు చెబుతానని, అలాగే, తాను వేసే ప్రతి ప్రశ్నకు కూడా ఆయన బదులివ్వాలని కోరారు. 
 
పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నగరంలో పుట్టారని, ఆ తెలంగాణ రాష్ట్రం వేరు, మన ఏపీ వేరని ముద్రగడ అన్నారు. హైదరాబాద్ నుంచి పిఠాపురంలో ఎమ్మెల్యే కావాలని కోరుకోవడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో అవమానం జరిగినపుడు ఇపుడున్న ఈ పౌరుషం, కోపం, పట్టుదల ఏమయ్యాయని అడిగారు. అవమానించిన వారి ఇంటికే టిఫిన్ చేశారని ఎద్దేవా చేశారు. పవన్ రెచ్చిపోయి మాట్లాడుతున్నారన్నారు. పైగా, ఎన్నికల్లో వైకాపా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుందని పవన్ పదేపదే వ్యాఖ్యానిస్తున్నారని, అంటే ప్రజలు డబ్బులకు అమ్ముడుపోయారన్న కోణంలో ఆయన మాట్లాడుతున్నారని తెలిపారు.