ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2024 (14:43 IST)

వైకాపాకు షాక్ : సొంత గూటికి చేరిన మహ్మద్ ఇక్బాల్

mohammed-iqbal
ఎన్నికలకు ముందు ఏపీలోని అధికార వైకాపాకు మరో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ వైకాపాను వీడారు. ఈయన తిరిగి సొంత పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
 
గత కొంతకాలంగా వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులు ఆ పార్టీని వీడుతున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలోనే మహ్మద్ ఇక్బాల్ కూడా పార్టీని వీడారు. కాగా, ఆయన నేపథ్యం పరిశీలిస్తే, ఆయన ఓ మాజీ ఐపీఎస్ అధికారి. గతంలో చంద్రబాబుకు ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేశారు. ఆ తర్వాత కాలంలో ఆయన టీడీపీలో చేరారు. ఆనంతరం టీడీపీకి రాజీనామా చేసి వైకాపా తీర్థం పుచ్చుకోగా, ఆయన సీఎం జగన్ ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చారు. 
 
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా తరపున హిందూపురం అసెంబ్లీ టిక్కెట్‌ను ఆశించగా, జగన్ మొండిచేయి చూపించారు. పైగా, హిందూపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించడమే కాకుండా, ఆయనకు ఇతర పదవులేవీ కేటాయించలేదు. అప్పటి నుంచి ఇక్బాల్ వైకాపా కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల వైకాపాకు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇపుడు మళ్లీ సొంతగూటికి చేరుకోవడం గమనార్హం.