శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (09:51 IST)

కోవిడ్ కేర్ కేంద్రంలో లేడీ కానిస్టేబుల్‌పై ఖాకీ అత్యాచారం.. ఎక్కడ?

స్వల్ప కరోనా వైరస్ లక్షణాలతో బాధపడేవారి కోసం కోవిడ్ కేర్ కేంద్రాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటుచేశాయి. ఈ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న మహిళా రోగులకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఓ కోవిడ్ కేర్ సెంటరులో విధులు నిర్వహిస్తున్న ఓ లేడీ కానిస్టేబుల్‍పై సహచర కానిస్టేబులే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జంషెడ్‌పూర్ నగరంలోని సిద్‌గోరా ప్రొఫెషనల్ కళాశాలలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేంద్రంలో పోలీసు కానిస్టేబుల్ అనిల్ కుమార్, ఓ మహిళా కానిస్టేబుల్‌తో కలిసి విధి నిర్వహిస్తున్నాడు. 
 
కొవిడ్ కేంద్రంలోని భవనంలో పై అంతస్తులో కరోనా వైరస్ ప్రభావం ఉండదని, అక్కడ సురక్షితమని చెప్పి మహిళా కానిస్టేబుల్‌ను పైగదిలోకి తీసుకువెళ్లిన కానిస్టేబుల్ అనిల్ కుమార్ ఆమె కేకలు వేయకుండా నోరు మూసి అత్యాచారం చేశాడు. 
 
ఆ కామాంధుడు నుంచి తప్పించుకున్న బాధితురాలు కోవిడ్ కేర్ సిబ్బంది సహకారంతో పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ ఘాతుకానికి పాల్పడిన కానిస్టేబుల్‌పై ఐపీసీ 376 (2) ప్రకారం కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. 
 
అలాగే బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, బాధిత మహిళా కానిస్టేబుల్ భర్త విధి నిర్వహణలో మరణించడంతో కారుణ్య నియామకం కింద ఉద్యోగం లభించింది.