శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 11 ఏప్రియల్ 2020 (07:54 IST)

దొంగకు కరోనా పాజిటివ్: అరెస్ట్ చేసిన పోలీసులకు, తీర్పు చెప్పిన జడ్జికి క్వారంటైన్!

పంజాబ్ లోని లూథియానాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ దొంగకు కరోనా పాజిటివ్ అని తేలడంతో, అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులను, తీర్పు ఇచ్చిన జడ్జిని క్వారంటైన్ తప్పలేదు.

లూథియానాలోని జనక్ పురి గణేశ్ కాలనీకి చెందిన 24 ఏళ్ల యువకుడు మోటార్ బైక్, మొబైల్ ఫోన్ చోరీ చేసి పోలీసులకు పట్టుబడ్డాడు.

పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులు చోరీ చేసిన బైక్ పై వస్తున్న ఆ యువకుడ్ని, చోరీలో అతడికి సహకరించిన మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. 
 
అతడ్ని కోర్టులో హాజరుపర్చగా, అనారోగ్యంతో బాధపడుతున్నట్టు న్యాయమూర్తి మోనికా చౌహాన్ గుర్తించారు. అతడితో పాటు మరో అనుచరుడు కూడా జ్వరం, దగ్గుతో బాధపడుతుండడంతో వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులను ఆదేశించారు.

వైద్య పరీక్షకు ముందే మరో వ్యక్తి తప్పించుకోగా, దొంగతనం చేసిన యువకుడికి కరోనా పాజిటివ్ అని వచ్చింది. దాంతో అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు మొత్తం 17 మందితో పాటు జడ్జి మోనికా చౌహాన్ సైతం క్వారంటైన్ లోకి వెళ్లాల్సి వచ్చింది.

అంతేకాదు, ఆ దొంగను ఉంచిన పోలీస్ స్టేషన్ ను అణువణువు శానిటైజ్ చేశారు.