Corona: జైళ్లలో ఖైదీలు కిక్కిరిసి ఉండటంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన
కరోనా మహమ్మారి ఉధృతంగా వ్యాపిస్తోన్న వేళ దేశంలోని జైళ్లలో ఖైదీలు కిక్కిరిసి ఉండటంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జైళ్లలో ఖైదీలకు కోవిడ్-19 సోకుతుండటంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీజేఐ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏడేళ్ల లోపు జైలు శిక్ష పడే నేరాల విషయంలో నిందితులను అవసరమైతేనే అరెస్ట్ చేయాలని స్పష్టం చేసింది. ఖైదీలందరికీ సరైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించింది.
కరోనా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్న ఖైదీలను గుర్తించి, వెంటనే రిలీజ్ చేసేలా చూడాలని రాష్ట్రాలు, యూటీలు ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీలకు చెప్పింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా జైళ్లలో రద్దీని తగ్గించే ఉద్దేశంతో అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది మార్చి 23 న కరోనా నేపథ్యంలో అర్హులైన ఖైదీలందరికీ బెయిల్, పెరోల్ మంజూరు చేసినట్లే… మరోసారి 90 రోజుల సెలవును మంజూరు చేయాలని ఆదేశించింది.
ఇటువంటివారికి తగిన షరతులను కూడా విధించాలని తెలిపింది. గత జాబితాలోని వారిని కచ్చితంగా విడుదల చేస్తూనే, కొత్త వారి పేర్లనూ విడుదల జాబితాలో చేర్చాలని సుప్రీం ఆదేశించింది. ఖైదీలకు, జైలు సిబ్బందికి రెగ్యులర్‌గా టెస్ట్‌లు చేయించి, కోవిడ్ వ్యాప్తిని నిరోధించాలని, అవసరమైనవారికి చికిత్స చేయించాలని తెలిపింది. ప్రతి రోజూ పరిశుభ్రత, పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొంది. జైళ్ళలో నిర్బంధంలో ఉన్నవారికి ఈ మహమ్మారి సోకకుండా తగిన చర్యలు నిరంతరం చేపట్టాలని పేర్కొంది.