సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 అక్టోబరు 2021 (16:51 IST)

5-11 ఏళ్ల వయసున్న చిన్నారులకు ఫైజర్ టీకా

ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల వయసున్న చిన్నారులకు ఫైజర్ టీకా ఇచ్చేందుకు అమెరికా అనుమతి ఇచ్చింది. దీంతో ఆ దేశంలో సుమారు 2.8 కోట్ల మంది చిన్నారులు కోవిడ్ టీకా తీసుకునే వెసలుబాటు కలుగనున్నది. ఉన్నత స్థాయి వైద్య బృందం ఇచ్చిన సలహా మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
 
చైనా, చిలీ, క్యూబా, యూఏఈ దేశాలు ఇప్పటికే చిన్నారులకు టీకాలు ఇస్తున్నాయి. ఓ తల్లిగా, ఓ డాక్టర్‌గా ఈ సందర్భం కోసం ఎదురుచూస్తున్నట్లు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ జానెట్ వుడ్‌కాక్ ఓ ప్రకటనలో తెలిపారు. పిల్లలకు టీకాలు ఇవ్వడం వల్ల కోవిడ్‌-19 అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆమె అన్నారు.
 
అమెరికాలో పిల్లల కోసం 5 కోట్ల కోవిడ్ డోసులను రెడీగా ఉంచినట్లు ఫైజర్ సంస్థ ప్రకటించింది. క్లినికల్ ట్రయల్స్‌లో సుమారు రెండు వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. 90 శాతం సమర్థంగా పనిచేసినట్లు తెలుస్తోంది. మూడు వేల మంది చిన్నారుల్లో వ్యాక్సిన్ సేఫ్టీ గురించి స్టడీ చేశారు. 
 
ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని గుర్తించామని అధికారులు తెలిపారు. వయోజనుల్లో వచ్చే తీవ్రమైన కోవిడ్ లక్షణాలు పిల్లల్లో ఉండవన్నారు. కరోనా మహమ్మారి మొదలైన నాటి నుంచి 5 నుంచి 11 ఏళ్ల వయసున్న వారిలో 8300 మంది చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. వారిలో 146 మంది మరణించారు.